ముస్తాబాద్/ పాన్‌గల్/కొందుర్గు, నవంబర్ 15: పొలం పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు రైతులు మృతి చెందారు. ఈ ఘటనలు రాజన్న సిరిసిల్ల, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్‌కు చెందిన బద్ది జయసింహారెడ్డి (62) శుక్రవారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లాడు. పొలం చుట్టూ తిరిగి నీటి గుంతలో కాళ్లు కడుక్కొని ఇంటికి వస్తున్న క్రమంలో స్టార్టర్ నుంచి బోర్‌కు విద్యుత్తు సరఫరా అయ్యే వైరు తాకడంతో షాక్ వచ్చి అక్కడికక్కడే మృతిచెందాడు. అటు వైపు వెళ్తున్న ఓ రైతు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం వెంగళాయిపల్లికి చెందిన రైతు పాలెం సుధాకర్ (56) తనకున్న నాలుగున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. శనివారం ఉదయం ఆయన పొలం వద్దకు వెళ్లాడు. పంటకు నీళ్లు పెట్టేందుకు స్టార్టర్ వద్ద స్విచ్ ఆన్ చేస్తుండగా బోర్డు వద్ద తేలి ఉన్న వైరు ప్రమాదవశాత్తు తగిలి విద్యుత్తు షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం పులుసుమామిడికి చెందిన రెడ్డి నర్సింహులుకు మహదేవ్పూర్ శివారులో వ్యవసాయ భూమి ఉన్నది. శుక్రవారం పొలం వద్దకు వెళ్లాడు. పొలం సమీపంలోని శ్రీశైలం అనే వ్యక్తి భూమిలోగల ట్రాన్స్ఫార్మర్ ఏ-బీ స్విచ్ ఆఫ్ చేసి వైర్ తీసే క్రమంలో విద్యుత్తు షాక్‌తో మృతి చెందాడు. మృతుడి భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.