తిరుమలగిరి(సాగర్)/రామాయంపేట/రామాయంపేట రూరల్/రఘునాథపల్లి, మార్చి 17 : అప్పులబాధ భరించలేక రాష్ట్రంలో ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం ఎర్రచెరువు తండాలో అప్పులబాధ తాళలేక కౌలు రైతు బానోతు కైలా(52) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కైలా గతంలో లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. వెన్ను నొప్పి కారణంగా డ్రైవింగ్ మానేసి, పొలం కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. మిర్చి పంట కోసం రూ.2 లక్షలు అప్పు చేయగా, దిగుబడి సరిగా రాక, అప్పు తీర్చేదారి లేక మనస్తాపం చెందాడు. సోమవారం పొలానికి వెళ్లి పురుగులమందు తాగడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతిచెందాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో యువరైతు మాసాయిపేట పురుషోత్తం (34) తన పొలంలో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాసంగిలో పొలంలో ఉన్న బోరు నీళ్లు తగ్గడంతో నాలుగు బోర్లను తవ్వించాడు. ఒక్కో బోరు 400 అడుగుల వరకు వేయించినా నీటిచుక్క రాలేదు. దీంతోపాటు యాసంగిలో వేసిన రెండెకరాల పొలం ఎండిపోయింది. రూ.6 లక్షల వరకు అప్పులు కావడంతో మనస్తాపం చెందాడు. పొలం వద్దకు వెళ్లి నీళ్లు పెడతానని ఆదివారం సాయంత్రం ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రి 11 గంటలైనా ఇంటికి తిరిగి రాలేదు.
కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా పురుషోత్తం చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలకేంద్రంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక పీఏసీఎస్ చైర్మన్ చీమలపాటి రవీందర్ (58) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రవీందర్ కంచనపల్లి చైర్మన్ పదవితోపాటు సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సొసైటీలో అవకతవకలు జరిగినట్టు ఇటీవల ఆయనపై ఫిర్యాదులు రావడంతో అధికారులు బహిరంగ విచారణ జరిపి రవీందర్ రూ.17 లక్షలు దుర్వినియోగం చేసినట్టు నిర్ధారించారు. దీంతో మండల కేంద్రంలో తనకున్న ఎనిమిది ఎకరాల భూమిలో 1.18 ఎకరాలు విక్రయించి ఆ మొత్తాన్ని చెల్లించాడు. దీనికి తోడు 2019లో సొసైటీ ఎన్నికల సమయంలో ఖర్చులు, ఇతరత్రా కలిపి రూ.కోటి దాకా అప్పులయ్యాయి. అప్పటినుంచి తరచూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో తీవ్ర మానసిన వేదనకు గురై ఈ నెల 8న వ్యవసాయ క్షేత్రంలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.