కారేపల్లి/రాజాపేట/నర్సాపూర్, ఏప్రిల్ 24 : దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం చెందిన ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం, యాదాద్రి, మెదక్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బతండాకు చెందిన లావుడ్యా భద్రు (52) రెండెకరాల్లో మిర్చి, మరో రెండెకరాల్లో పత్తి పంట వేశాడు. సాగు చేసిన పంటను చీడపీడలు ఆశించడంతో ఆ ప్రభావం దిగుబడులపై పడింది. దీంతో పంట సాగు కోసం తెచ్చిన అప్పులు తీర్చేందుకు వ్యవసాయం చేయడంతోపాటు ఓ షాపులో గుమస్తాగా చేరాడు. అయినా అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన భద్రు తన మిర్చి తోట వద్దకు వెళ్లి బుధవారం ఉదయం గడ్డి మందు తాగాడు.
తర్వాత భార్యకు ఫోన్‌చేసి.. ‘నేను గడ్డి మందు తాగాను. పిల్లలు జాగ్రత్త’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే చేను వద్దకు చేరుకుని భద్రును ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకొచ్చి అనంతరం వాహనంలో ఖమ్మం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ భద్రు గురువారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై నాగరాజకుమారి తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కొండ్రెడ్డి చెరువు గ్రామానికి చెందిన రైతు కర్రె మహేశ్(28) వ్యవసాయంతో పాటు ఆటో నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి నిర్మాణం కోసం రూ. 10 లక్షలు, సాగునీటి కోసం వేసిన బోర్లకు రూ. 4 లక్షలు అప్పు చేశాడు. పంట దిగుబడి లేక, ఆటో నడువక చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురయ్యాడు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లారెడ్డిగూడ తండాకు చెందిన నేనావత్ జహంగీర్ (35) తనకున్న ఎకరా పొలంలో సరిగ్గా నీరు లేకపోవడంతో అప్పు చేసి మూడు బోర్లు వేయించాడు. దీంతోపాటు వేసిన పంట సరిగ్గా పండక తీవ్ర నష్టం వాటిల్లింది. బోర్లకు, పంట పెట్టుబడికి సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు అయ్యాయి. చేసిన అప్పులకు వడ్డీ పెరిగిపోవడంతో జహంగీర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఈనెల 12న తన పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు నర్సాపూర్ ఏరియా దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడికి భార్య నేనావత్ సుజాత, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై లింగం తెలిపారు.