హెచ్చరించిన వాతావరణ కేంద్రం
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వానలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరంలోని నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. నైరుతి రుతుపవనాల గమనం చురుకుగా ఉన్నదని తెలిపింది. దీని ప్రభావంతో రాగల నాలుగైదురోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సీఎస్, ఎస్ఎండీఏ రిలీఫ్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయని టీఎస్‌డీపీఎస్ తెలిపింది. అత్యధికంగా కుమ్రంభీం జిల్లా సిర్పూర్ టీ మండలంలోని వెంకట్రావ్‌పేటలో 13.06, జగిత్యాల జిల్లా కోరుట్లలో 12.95, వికారాబాద్, కుల్కచర్ల మండలం పుట్టపహాడ్‌లో 11.50, సిద్దిపేట జిల్లా ధూల్మిట్టలో 10.73, మద్దూర్ మండలం రేబర్తిలో 10.53, జనగామ జిల్లా బచ్చన్నపేటలో 9.93, సిద్దిపేట జిల్లా నార్నూర్‌లో 9.45, మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్‌లో 9.23, జగిత్యాల జిల్లా మెట్పల్లి 9.08 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో ఆరు సెంటీమీటర్లకుపైగా వాన పడింది.