హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వేదికగా మూడ్రోజుల ప్రాపర్టీ షో శుక్రవారం ప్రారంభమైంది. క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైటెక్స్‌లో జరుగుతున్న ఈ ప్రదర్శనలో 70కి పైగా నిర్మాణ, బ్యాంకింగ్ సంస్థలు 300 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ఆవిష్కరించాయి. ‘ఎంపిక మీదే’ అంశంతో హైదరాబాద్ కేంద్రంగా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు క్రెడాయ్ హైదరాబాద్ ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాపర్టీ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎన్ జైదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మోడల్ థీమ్‌తో నగరాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ సహకారం కీలకమని అన్నారు.
సమగ్ర క్రీడా విధానం, మౌలిక వసతుల విస్తరణ, రియల్ ఎస్టేట్ జోన్ల అభివృద్ధి నగర రియల్టీ రంగానికి కలిసివస్తాయని చెప్పారు. 2024లో లక్ష కోట్ల రూపాయల విలువైన గృహ విక్రయాలు జరిగాయని తెలిపారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రధానకార్యదర్శి క్రాంతికిరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. జల వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ కుర్రా శ్రీనాథ్, కో కన్వీనర్ అరవింద్‌రావు, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జీ రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ ఇంద్రసేనారెడ్డి, ఉపాధ్యక్షులు మనోజ్‌కుమార్ అగర్వాల్, కే అనిల్‌రెడ్డి, రవిప్రసాద్, సంజయ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
సందడి షురూ..
కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా ఉండే స్థిరాస్తులను ఎంపిక చేసుకునేలా క్రెడాయ్ హైదరాబాద్ రియల్టీ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదివారం వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో ఒకే వేదిక ద్వారా కమర్షియల్, రెసిడెన్షియల్, విల్లా, ఓపెన్ ప్లాట్లతోపాటు పర్యావరణహితమైన గృహాలను ఎంపిక చేసుకునేలా ప్రాజెక్టులను నిర్మాణ సంస్థలు ప్రదర్శించాయి. నగరం నలువైపులా విస్తరించి ఉన్న 300కు పైగా ఉన్న ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ రియల్టీ ప్రదర్శన ఉంటుందని, కొత్తగా సొంతింటి కోసం వెదుకుతున్నవారికి ఈ ప్రాపర్టీ షో సరైన వేదిక అని క్రెడాయ్ హైదరాబాద్ వర్గాలు వెల్లడించాయి.