నాగర్‌కర్నూల్, జూలై 1 : వర్షానికి మట్టిమిద్దె కూలి ముగ్గురు చిన్నారులు సహా తల్లి మృతి చెందగా.. ఒకరు గాయపడిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. వనపట్లకు చెందిన గొడుకు భాస్కర్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఆదివారం రాత్రి భోజనం అనంతరం భార్య పద్మమ్మ(28), కూతుళ్లు తేజస్విని(7), వసంత(5), కొడుకు రిత్విక్(13 నెలలు)తో కలిసి భాస్కర్ ఇంట్లో నిద్రపోయాడు. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షానికి వీరు నివసించే మట్టిమిద్దె అర్ధరాత్రి తర్వాత కుప్పకూలింది. పెద్ద శబ్దం రాగా సమీప ఇండ్లవాసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇంట్లోని ఫ్రిజ్ మీద పడడంతో భాస్కర్ ప్రాణాలతో ఉండగా అతడిని బయటకు తీశారు. అతని భార్య, పిల్లలు మట్టిలో కూరుకుపోయి ఊపిరాడక మృతి చెందారు. భాస్కర్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖానకు తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురి మృతితో గ్రామంలో విషాదం అలుముకున్నది.
అండగా ఉంటాం : మంత్రి జూపల్లి
ఘటనపై మంత్రి జూపల్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇల్లు కూలి తల్లీపిల్లలు మృతిచెందడం బాధాకరమన్నారు. భాస్కర్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి కూలిన ఇంటిని పరిశీలించారు. తక్షణ సాయంగా రూ.20 వేలు అందజేశారు. భాస్కర్‌ను కలెక్టర్ సంతోష్ పరామర్శించారు. ప్రభుత్వ పరంగా రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.