హైదరాబాద్: హైదరాబాద్‌లో పట్టపగలే ఖజానా జువెల్లర్స్ దుకాణంలో (Khazana Jewellery) కాల్పులు జరుపుతూ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బీదర్‌లో ఇద్దరిని, పుణెలో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందులు బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
ఈ నెల 12న చందానగర్‌లోని ఖజానా జ్యవెలర్స్‌లో పట్టపగలే దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. నగల దుకాణంలోకి చొరబడిన దుండగులు డిప్యూటీ మేనేజర్‌పై కాల్పులు జరిపారు. ఆ తర్వాత షాపులోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగులగొట్టారు. అవన్నీ మూడు బ్యాగుల్లో నింపుకుని అక్కడినుంచి బయటకు వచ్చి బైకులపై వెళ్లిపోయారు. పోలీసులు వచ్చే సమయానికే పారిపోయిన దొంగల ముఠా.. సీసీ కెమెరాలపై కాల్పులు జరిపి వాటిని కూడా ధ్వంసం చేశారు.
కాగా, దోపిడీ ముఠా నెల క్రితమే బీహార్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటూ ఓ గ్లాసు పరిశ్రమలో పనిలో చేరారు. బీహార్ నుంచి వచ్చేటప్పుడు తుపాకులు తెచ్చుకొని, కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. దోపిడీ అనంతరం ఇక్కడి నుంచి పరారయ్యారు.