ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 11 : ఫేక్ ఇన్స్టాగ్రామ్ సృష్టించామని.. ఫొటోలు మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేస్తామని ఓ వివాహితను వేధిస్తున్న యువకులను ఆమె కుటుంబ సభ్యులు చితకబాదారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్‌నగర్ మండలం తొర్రూరు గ్రామానికి చెందిన యువతికి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శేరిగూడకు చెందిన యువకుడితో ఇటీవల వివాహమైంది.
కాగా ఫొటోను మార్ఫింగ్ చేసి ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడీని సృష్టించి పోస్టు చేస్తామని ఆమె సొంతూరుకు చెందిన విజయ్, సాయి, సూర్య అనే ముగ్గురు యువకులు వారం రోజులుగా వేధిస్తున్నారు. ఆమె విషయం భర్తకు తెలుపడంతో ఆయన మరో నలుగురితో కలిసి తొర్రూరు వెళ్లి విజయ్, సాయి, సూర్యను పట్టుకొని ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కర్రలు, వైర్లతో చితకబాదారు. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.