హైదరాబాద్ సిటీబ్యూరో/ సంగారెడ్డి, సెప్టెంబర్ 4: హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడిన ఫిజియోథెరపిస్ట్ బండ్ల విప్లవ్‌ను సంగారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ రూపేశ్ బుధవారం సంగారెడ్డిలో వివరాలు వెల్లడించారు. అమీన్పూర్లో విల్లా నిర్మాణాలు చేపట్టిన రాజేందర్ అనే యజమానిని సాయివిల్లాస్ కాలనీలో ఉండే బండ్ల విప్లవ్ రూ.20లక్షలు డిమాండ్ చేశాడు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనకు దగ్గరని బెదిరించాడు. ఈ నెల 3న రాజేందర్, అతని పార్ట్నర్ మంజునాథ్‌రెడ్డి మరో ఇద్దరితో కలిసి బండ్ల విప్లవ్ సిన్హా ఇంటికి వెళ్లి రూ.2లక్షలు అడ్వాన్సుగా ఇస్తుండగా టాస్క్‌ఫోర్స్, అమీన్పూర్ పోలీసులు పట్టుకున్నట్టు ఎస్పీ తెలిపారు.
హైడ్రా పేరుతో దందాలకు దిగితే జైలే: రంగనాథ్
హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. బ్లాక్‌మెయిలింగ్‌లకు పాల్పడితే స్థానిక పోలీస్‌స్టేషన్, ఎస్పీ, సీపీలు, హైడ్రా కమిషనర్, ఏసీబీకి ఫిర్యాదు చేయాలని రంగనాథ్ సూచించారు.
లంచమడిగితే ఫోన్‌చేయండి: ఏసీబీ డీజీ
హైడ్రా పేరిట ఎవరైనా లంచమడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ తెలిపారు. భూ, ఇండ్ల యజమానులకు గతంలో జారీ చేసిన నోటీసులను అడ్డుపెట్టుకొని కొందరు ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. నకిలీ నోటీసులు పంపించినా, ఫోన్‌కాల్స్ చేసినా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్18001064కు ఫోన్‌చేయాలని కోరారు.
కాంగ్రెస్ దాడి సిగ్గుమాలిన చర్య
ఖమ్మంలో వరద బాధితుల పరామర్శకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గూండాల దాడి సిగ్గుమాలిన చర్య. బురద రాజకీయం చేయొద్దన్న సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నదేమిటి? ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోదు.. ప్రతిపక్షం ఆదుకునేందుకు ముందుకొస్తే కాంగ్రెస్ కార్యకర్తలతో దాడులు చేయిస్తారా? మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి కార్లపై దాడిచేసిన కాంగ్రెస్ కార్యకర్తను అరెస్టు చేయాలి.
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి
దాడి పిరికిపందల చర్య
ఖమ్మం జిల్లాలో మంత్రుల బృందంపై ప్రభుత్వం దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న. విపతర పరిస్థితిలో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి రాజకీయం చేయడం తగదు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే దాడులు చేస్తున్నారు. బీఆర్ఎస్ని చూసి ఓర్వలేక ఆడలేక మద్దెలవోడు అన్నట్టుగా సరారు తీరు ఉన్నది. దాడిచేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలి.
-బీఆర్ఎస్ నేత, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి