MLC Shambhipur Raju | హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. మండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి చారి నేతృత్వంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశాం. ఫోన్లు చేసి బెదిరించే వారిపై చర్యలు తీసుకోవాలి. శంభీపూర్ రాజు ఉద్యమంలో కీలకంగా పని చేశారు. రాజు వెంట 60 లక్షల బీఆర్ఎస్ సైన్యం ఉంది. ఆయనకు వస్తున్న బెదిరింపు కాల్స్‌పై లోతైన విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. మైనంపల్లి హన్మంతరావు బజారు రౌడీలా వ్యవహరిస్తున్నారు. గుండల్లాగ బెదిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యక్తులపై దృష్టి పెట్టి శిక్షించాలి అని ఎమ్మెల్సీ మధుసూదనాచారి డిమాండ్ చేశారు.