హైదరాబాద్, జూన్16 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకే కాకుం డా తెలంగాణకూ ముంపు ముప్పు పొంచి ఉన్నదని, ఆయా రాష్ర్టాలతో సమానంగా ఇక్కడా నష్టనివారణ చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి రాష్ట్ర నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ఇటీవల లేఖను రాశారు. రాష్ట్ర అభ్యంతరాలను పీపీఏ దృష్టికి లేఖలో తీసుకెళ్లారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు వేసిన కేసులపై ఇటీవల జరిగిన పీపీఏ పాలకమండలి మొదటి సమావేశంలో చర్చించారని వివరించారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల ఆయా రాష్ర్టాల్లో ముంపునకు గురవుతున్న గ్రామాలు, వాటిలో ఇప్పటివరకు ప్రజాభిప్రాయసేకరణ చేపట్టని గ్రామాల వివరాలను.. సుప్రీంకోర్టు నిర్దేశించిన 13 అం శాలవారీగా అందజేయాలని పీపీఏ చైర్మన్ సంబంధిత అధికారులను ఆదేశించారని గుర్తుచేశారు. అయితే తెలంగాణకు వాటిల్లుతున్న నష్టానికి సంబంధించి పీపీఏ స్పందించకపోవడంపై రాష్ట్ర సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలు సుప్రీంకోర్టులో వేసిన కేసుల్లో తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఇంప్లీడ్ అయ్యిందని గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలోనే మూడు రాష్ర్టాల్లో ముంపు సమస్యల అధ్యయనానికి 13అంశాలతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసిందని, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సైతం తెలంగాణలో ముంపుపై అధ్యయనం చేసిందని ఈఎన్సీ మురళీధర్ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల కిన్నెరసాని, ముర్రేడువాగుల్లో నీరు నిలిచి ఉంటుందని, గోదావరిలో కలిసే ప్రసక్తే ఉండబోదని సీడబ్ల్యూసీ అధ్యయనం తేల్చిందని చెప్పారు. పోలవరం వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నప్పుడు గోదావరి నుంచి కిన్నెరసాని నదిలో ఎగువన 13.75 కిలోమీటర్లకు, ముర్రేడువాగులో గోదావరి నుంచి 5.25 కిలోమీటర్ల ఎగువ వరకు బ్యాక్‌వాటర్ నిలిచి ఉంటుందని వివరించారు.
కనీసంగా 25.53 లక్షల క్యుసెక్కుల ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకున్నా.. గోదావరి నుంచి కిన్నెరసానిలో 13 కిలోమీటర్లు, ముర్రేడువాగులో 3.75 కిలోమీటర్ల బ్యాక్‌వాటర్ నిలిచి ఉంటుందని ఆ రిపోర్టు తేల్చిచెప్పిందని ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. కిన్నెరసాని ముంపుతో బూర్గుంపాడు మండలం తీవ్రంగా నష్టపోతుందని, కొత్తగూడెం పట్టణం గుండా పోయే ముర్రేడువాగు ముంపునకు గురైతే పట్టణం మునిగిపోతుందని ఆయన పే ర్కొన్నారు. తెలంగాణ ముంపుపై పీపీఏ స్పందించడం లేదని, పాలకమండలి సమావేశంలో జరిగిన చర్చలోనూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణను భాగం చేయలేదని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. పోలవరం ముంపుతీవ్రతను లెక్కించే విషయంలో ఇప్పటికైనా ఆ రెండు రాష్ర్టాలతోపాటు తెలంగాణనూ చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కిన్నెరసాని, ముర్రేడువాగులో నీరు నిలిచి ఉండే ప్రాంతం వరకు రక్షణ గోడలు నిర్మించాలని, నివారణ చర్యలు చేపట్టాలని పీపీఏకు ఈఎన్సీ మురళీధర్ విజ్ఞప్తి చేశారు.