Warangal | వరంగల్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రామప్ప ఆలయం అనగానే గుర్చుకొచ్చేది ఓరుగల్లు.. అనేక పర్యాటక ప్రాంతాలతో అలరారుతూ విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్న ఈ ‘కాకతీయ సామాజ్య్రం’లో రామప్ప ఆలయానికే కాదు, దాని దరిదాపులో ఉన్న రామప్ప చెరువు, లక్నవరం సరస్సు, కోటగుళ్లు, సమ్మక్క-సారలమ్మలు కొలువైన మేడారంపైనా ‘మైనింగ్’ ప్రభావం తీవ్రంగా పడనున్నది. ప్రశాంతతకు, పర్యావరణ సమతుల్యానికి చిరునామాగా నిలిచిన ఈ ప్రాంతమంతా సింగరేణి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాచేసే ‘ఓపెన్ కాస్ట్’గనితో బొందలగడ్డగా మారనున్నది. పచ్చని చెట్లు, గుట్టలు, సరస్సులు, కాయతీయుల ఆలయాలన్నీ మట్టికొట్టుకుపోయే ప్రమాదమున్నది. గని నుంచి తవ్విపోసిన బూడిద కొండలతో ఈ ప్రాంతాన్ని వరదలు కూడా ముంచెత్తే అవకాశమున్నది.
దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు, సందర్శకులకు రామప్ప రిలీఫ్ ఇచ్చే ఎకో టూరిజం స్పాట్‌గా అవతరించింది. దేశంలోనే గొప్ప పర్యాటక ప్రదేశంగా మారింది. యునెస్కో గుర్తింపు తర్వాత ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. రామప్ప కేంద్రంగా చుట్టూ 25 కిలోమీటర్ల వరకు పర్యాటక ప్రదేశానికి నెలవుగా మారింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతో ఇప్పుడు ఈ ప్రదేశం ఉనికే ప్రమాదంలో పడింది. పర్యాటక ప్రాంతం నడిబొడ్డున ఏర్పాటయ్యే సింగరేణి కాలరీస్ కంపెనీ ఓపెన్ కాస్టు మైనింగ్‌తో ఈ ప్రదేశమంతటా బూడిదే వ్యాపించనున్నది. గనిలో పేలుళ్లతో సుమారు రెండు కిలోమీటర్ల వరకు భూ ప్రకంపనలు ఉంటాయి. బొగ్గు పెళ్లలు, రాళ్లు కిలోమీటర్ల దూరం వరకు ఎగిరి పడతాయి. పేలుళ్ల కారణంగా భూపాలపల్లిలోని ఓపెన్ కాస్ట్ సమీపంలో ఉన్న దుర్గంరామయ్యగడ్డలో ఇండ్లను సింగరేణి అధికారులు ఖాళీ చేయించారు. గడ్డిగానిపల్లిని తరలించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. గణపురం మండలంలో కొనసాగుతున్న ఓపెన్ కాస్టు 3 పరిధిలోని మాధవరావుపల్లినీ ఖాళీ చేయించారు. కొండంపల్లిని తరలించే ప్రక్రియ వేగవంతం చేశారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మంచిర్యాల వరకు బొగ్గు నిక్షేపాలు, గనులు విస్తారంగా ఉన్నాయి. బొగ్గు ఉన్నట్టు నిర్ధారించి తవ్వకాలు మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్న ప్రాంతాలున్నాయి. ఇవన్నీ పక్కనబెట్టి సింగరేణి కాలరీస్ కంపెనీ రామప్ప ప్రాంతంలోనే ఓపెన్‌కాస్ట్ గనుల ఏర్పాటు కోసం వేగంగా కదులుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొగ్గు అందరి అవసరాలు తీర్చేదైనప్పటికీ చారిత్రక సంపద, పర్యావరణం, జీవావరణాన్ని దెబ్బతీసేలా ఈ ప్రాంతంలో ఓపెన్ కాస్టులు ఏర్పాటు చేయడం సరికాదని పర్యావరణ, పురావస్తు నిఫుణులు అంటున్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీకి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓపెన్ కాస్టు 1 మూతపడగా.. ఓపెన్ కాస్ట్, గణపురం మండలంలోని ఓపెన్ కాస్టు 3లో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నది. దీనికి కొనసాగింపుగా రామప్ప ఆలయం ఉన్న వెంకటాపూర్ మండలం మీదుగా ములుగు వరకు ఓపెన్ కాస్టు 4, ఓపెన్ కాస్టు 5 గనుల ఏర్పాటుకు భూసేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఆరు జిల్లాల పరిధిలో సింగరేణి సంస్థ బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం 22 భూగర్భ, 18 ఓపెన్ కాస్ట్ గనులున్నాయి. ఓపెన్ కాస్ట్లో భాగంగా భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమైన బొగ్గును బయటకు తీసే క్రమంలో ముందుగా భూ ఉపరితలంలో ఉన్న మట్టిని తొలగించాల్సి గనుల స్వభావాన్ని బట్టి టన్ను బొగ్గుకు సగటున ఐదు టన్నుల వరకు మట్టి తొలగించాల్సి ఉంటుంది. ఇలా తొలగించే మట్టిని ఓవర్ బర్డెన్ (ఓబీ)గా పిలుస్తారు. ఓబీ మట్టిని గని వెలుపల పోస్తుంటారు. మొదట్లో మట్టి కుప్పలను భూమి నుంచి 60 మీటర్ల ఎత్తు వరకు పోసేందుకు అనుమతి ఉండేది. తర్వాత 90 మీటర్లకు, మూడేళ్ల కిందట 120 మీటర్లకు పెంచారు. ఇప్పుడు 150 మీటర్లకు పెంచేందుకు ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. ఇదే జరిగితే మైనింగ్ కోసం తవ్వే మట్టి గుట్టలు కొండంత ఎత్తులో ఉండనున్నాయి. ఓపెన్ కాస్టు గనుల ప్రాంతంలో అంతా అడవులే ఉంటాయి. ఇక్కడ భారీ వర్షాలు కురిసినప్పుడు దిగువ భాగంలో ఆకస్మికంగా వరదలు వస్తున్నాయి. భదాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో ఈ నెల మొదటి వారంలో 25 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఓబీ మట్టి గుట్టల మీదుగా వచ్చిన వరద రక్షణ కందకాలను దాటుకొని దిగువనున్న మణుగూరు పట్టణంలోకి ప్రవేశించింది. లోతట్టు ప్రాంతం, నాలాలకు ఇరువైపులా వరదలు వచ్చాయి. రామప్ప ప్రాంతంలోనూ ఓపెన్ కాస్ట్ గనులు చేపడితే మట్టి గుట్టల నుంచి వచ్చే వరద నీరు ఒంపుగా ఉండే రామప్ప చెరువు వైపే ప్రవహించే అవకాశం ఉంటుంది. చెరువు ముందు ఉండే రామప్ప ఆలయం వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడి ఊరు, అటవీపై వరద పోటెత్తనున్నది.