Telangana | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): పచ్చని పాలమూరు హత్యా రాజకీయాలకు వేదిక అవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుల అండ చూసుకొని కొందరు కాంగ్రెస్ నాయకులు చెలరేగిపోతున్నారు. వారి దౌర్జన్యాలకు పోలీసులు సైతం వంతపాడటం మరింత విషాదం. హైదరాబాద్‌కు చెందిన పాలాది కళావతి కుటుంబాన్ని పోలీసులే బలవంతంగా తమ వాహనంలో తీసుకెళ్లి, చెప్పినట్టు వినకపోతే చంపేస్తామని స్టేషన్లోనే బెదిరించి దొంగ డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ముఖ్యమంత్రి అన్నదమ్ముల అండ చూసుకొని మహబూబ్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ నేత చలువగాలి రాఘవేందర్‌రాజు తమను చంపేస్తామని పోలీసుల ముందే హెచ్చరిస్తున్నారని, స్థానిక పోలీసులు సైతం ఆయనకే వంతపాడుతున్నారని, వారి నుంచి తమకు ప్రాణహాని ఉన్నదని బాధితులు శుక్రవారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన పాలాది చంద్రమౌళీశ్వర్ మహబూబ్‌నగర్ జిల్లా, మహబూబ్‌నగర్ అర్బన్ మండలం పాల్కొండ గ్రామ శివారులోని సర్వే నంబర్ 272/1లో 7 ఎకరాల 30 గుంటల భూమిని 1988లో తన కుమారుల కోసం కొనుగోలు చేశారు. ఆయన చనిపోయిన తర్వాత 2023లో జడ్చర్లకు చెందిన శివలింగం అనే వ్యక్తికి ఆ భూమిని విక్రయించేందుకు చంద్రమౌళీశ్వర్ భార్య కళావతి, కుమారులు శ్రీనివాస్, రాంబాబు ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం 2024 మే 8న వారికి ఆ భూమిలో 51 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు.
ఆ అగ్రిమెంట్లో కాంగ్రెస్ నేత రాఘవేందర్‌రాజు పేరును శివలింగం చేర్చారు. రాఘవేందర్‌రాజు ఎవరో వారికి అప్పటికి తెలియదు. ఆ తర్వాత ఒప్పందం ప్రకారం రూ. 50 లక్షలు ఇవ్వాల్సి ఉండగా రూ. 30 లక్షలు మాత్రమే ఇచ్చి మొత్తం ఇచ్చినట్టు ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అంతేకాదు, ప్లాట్లకు పోగా మిగిలిన మూడెకరాల భూమిని సైతం తమకే ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
తమకు రాజకీయంగా ఎలాంటి అండదండలు లేవని గుర్తించిన రాఘవేందర్‌రాజు ఉన్న మూడెకరాలను గుంజుకునేందుకు పంతం పట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అండ చూసుకొని రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించకపోతే చంపేస్తానని నేరుగా బెదిరిస్తున్నట్టు తెలిపారు. ‘సీఎం సోదరులతో నాకు బాగా పరిచయం ఉంది. రాష్ట్రస్థాయిలో బాగా పలుకుబడి ఉన్న నేతను నేను. ఏం చేసినా నన్ను అడిగే వారు లేరు. మిగిలిన 3 ఎకరాల భూమిని నాకే ఇవ్వాలి. లేదంటే మీరు డబ్బులు తీసుకున్న ఫొటోలు, వీడియోలు నా దగ్గర ఉన్నాయి. మీ అంతు చూస్తా’ అంటూ తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఆ మూడెకరాలను ఎవరికైనా విక్రయించుకోవచ్చని సామ శివలింగం, అతడి మరో పార్టనర్ సురేశ్ కూడా చెప్పారని, వారి ఇష్ట ప్రకారం గతేడాది సెప్టెంబర్ 3న సరెండర్ అండ్ భరోసా పత్రాన్ని రాసి ఇచ్చారని మానవ హక్కుల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘మూడెకరాల భూమికి ఒక పైసా ఇవ్వం. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చెయ్యాలి. మళ్లీ వారం తరువాత పిలుస్తాం. వచ్చి మాకు రిజిస్ట్రేషన్ చేసి వెళ్లి పోవాలి. ఈ విషయాన్ని బయట ఎకడైనా చెప్తే, రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా మిమ్మల్ని చంపేస్తాం’ అని సీఐ గాంధీనాయక్, ఎస్సై విజయ్‌కుమార్, చలువగాలి రాఘవేందర్‌రాజు భయపెట్టారని బాధితులు బోరున విలపించారు. ఆ తరువాత పోలీసులు వారికి అనుకూలంగా స్టేట్మెంట్లు రాసుకొని తమ చేత సంతకాలు తీసుకొని బెదిరించి పంపారని పేర్కొన్నారు. ఆ రోజు నుంచి తాము ప్రాణభయంతో ఇల్లు వదిలి వేరే చోట తలదాచుకుంటున్నట్టు తెలిపారు. తమకు రూ. 2.5 కోట్లు ఇచ్చామని తప్పుడు ప్రచారం చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్న మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్సై విజయ్‌కుమార్, చలువగాలి రాఘవేందర్‌రాజు, ఆయన డ్రైవర్ శివగౌడ్, సురేశ్, సామ శివలింగంపై చట్టపరమైన చర్య తీసుకోవాలని మానవహక్కుల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ఇటీవల డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేసినా పోలీసుల ఆగడాలు తగ్గడం లేదని వాపోయారు. మొదటి నుంచి తమను బెదిరించి, చంపేస్తామని అంటున్న సీఐ గాంధీనాయక్, ఎస్సై విజయ్‌కుమార్‌కు ఉత్తమ పోలీస్ అవార్డులు ఎలా ఇస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
సివిల్ తగాదాల్లో పోలీసులు తలదూర్చవద్దని సాక్షాత్తూ డీజీపీ జితేందర్ పలుమార్లు హెచ్చరించినా కొందరు పోలీసులు ఆయన మాటలు బేఖాతరు చేస్తున్నారని బాధితులు తెలిపారు. రాఘవేందర్రాజుపై బాధితులు పలుమార్లు మహబూబ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు.. ఈ నెల 2న ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ వచ్చి తమను బలవంతంగా కారులో మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్టు వారు పేర్కొన్నారు. అక్కడ సీఐ గాంధీనాయక్, ఎస్సై విజయ్‌కుమార్‌తోపాటు రాఘవేందర్‌రాజు తన కుమారుడిని ఉదయం నుంచి సాయంత్రం వరకు చిత్రహింసలు పెట్టారని కళావతి కన్నీటి పర్యంతమయ్యారు. ‘విరాసత్ కోసం వేలిముద్ర వెయ్యకుంటే నీ కుమారుడిని చంపేస్తం’ అని పోలీసుల సమక్షంలోనే రాఘవేందర్‌రాజు భయపెట్టినట్టు ఆరోపించారు. ఆ తర్వాత రాఘవేందర్‌రాజు కారు డ్రైవర్ శివగౌడ్ కారులో మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి, తన చేత బలవంతంగా వేలిముద్రలు వేయించారని, రాత్రి 9 గంటలకు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తన కొడుకును భయపెట్టారని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు.