హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 ( నమస్తే తెలంగాణ ): ఎన్నికల క్షేత్రంలోకి దిగామంటే చివరి క్షణం వరకు విజయం కోసం పోరాడతారు. ప్రత్యర్థి ఎత్తులను చిత్తుచూస్తూ ముందుకు సాగుతుంటారు. ఓటర్ల మనసులు గెలుచుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. ఎన్నికల వేళ సాధారణంగా కనిపించే సీన్ ఇది. కొందరుంటారు.. వారికి గెలుపుతో పనిలేదు. నామినేషన్ వేశామా.. పోటీ చేశామా.. అంతవరకే. అంతమాత్రాన గెలుపు కోసం శ్రమించరా? అంటే కష్టపడతారు. గెలుపు దైవాధీనం. ఓడిపోయినా హ్యాపీనే. దీనివెనక ఓ పెద్ద కథే ఉంది. దానిపేరే ‘కంటెస్టెడ్ ఎమ్మెల్యే’. అవును! ఓటమి వీరిని బాధించదు. వీరి తాపత్రయమంతా ‘కంటెస్టెడ్ ఎమ్మెల్యే’ ట్యాగ్ కోసమే. ఈ ఒక్క కారణంతో ఈసారి ఎన్నికల బరిలో దిగిన వారి సంఖ్య అమాంతం పెరిగింది. కొన్ని నియోజకవర్గాల్లో 20కి పైగా నామినేషన్లు దాఖలైతే, మరికొన్ని నియోజకవర్గాల్లో 40కిపైగా వచ్చాయి. వీరిలో అత్యధికులు ట్యాగ్ కోసం తాపత్రయ పడేవారే ఉండడం విశేషం. ఈ నెల 10తో రాష్ట్రంలో నామినేషన్ల గడువు ముగిసింది. దాదాపు 3,800 నామినేషన్లు దాఖలయ్యాయి. 2018 ఎన్నికల్లో 2,844 నామినేషన్లు దాఖలు కాగా ఈసారి అంతకుమించి రావడం గమనార్హం.
గెలుపు కాదు.. ట్యాగ్ కావాలి
ఈసారి ఎన్నికల బరిలోకి ఆటో డ్రైవర్ల నుంచి ఉద్యోగుల వరకు చాలామంది ఎన్నికల రణరంగంలోకి దూకారు. గెలుపు కోసమా? అంటే కాదు. గెలవమని తెలిసీ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నది కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవాలనే. ఇదేమాటను ‘గ్రేటర్’లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ఓ ఆటోడ్రైవర్ తెలిపారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు మినహా మిగతా వారందరూ పోటీ చేస్తున్నది ఇందుకోసమే. కంటెస్టెడ్ ఎమ్మెల్యే ట్యాగ్‌తో ప్రజల్లో పబ్లిసిటీ పెరిగి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చన్నది ఇంకొందరి మాట. గ్రేటర్ హైదరాబాద్‌లో 436 మంది బరిలో ఉండగా వారిలో 24 మంది మినహా మిగతా వారందరూ ఈ ట్యాగ్ కోసమే బరిలోకి దిగడం విశేషం.