హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్ ఇతర నిషేధిత వస్తువులు స్మగ్లింగ్ చేస్తున్నారంటూ బెదిరించి, డిజిటల్ లాక్ చేసి సైబర్ దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలకు సంబంధించిన 1,000 స్కైప్ ఐడీలను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేయించింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఎప్పటికప్పుడు ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఅర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) అప్రమత్తంగా ఉంటుంది. 1930కు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఐ4సీ ఆ వివరాలను విశ్లేషిస్తుంది. ఆయా రాష్ర్టాల్లోని సైబర్ క్రైమ్ విభాగాల నివేదికలు, బాధితుల నుంచి వచ్చే వివరాలతో ఎప్పటికప్పుడు సైబర్‌నేరాల అదుపునకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో పోలీసులమని చెబుతూ డిజిటల్ లాక్ చేస్తూ, అమాయకులను డిజిటల్ అరెస్ట్ చేస్తున్న క్రిమినల్స్ వాడుతున్న స్కైప్ ఐడీలను గుర్తించి మైక్రోసాఫ్ట్నకు నివేదిక ఇవ్వడంతో వెయ్యి స్కైప్ ఐడీలను బ్లాక్ చేసింది.