బెంగళూరు, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): సంపూర్ణ ఆనందానుభూతే శివరాత్రి పర్వదినం ముఖ్య ఉద్దేశమని ఆర్ట్ ఆఫ్ లివిం గ్ గురువు శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. బెంగళూరులోని ఆశ్రమానికి శివరాత్రి పర్వదిన వేడుకల కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా వేలాది మంది వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా గురుదేవ్ రవిశంకర్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతర్గతంగా ఉన్న పరమానంద స్థితిని చేరుకోవడమే శివరాత్రి అని పేర్కొన్నారు. శివుడంటే శాంతి, ప్రేమ, అనంతం అని అభివర్ణించారు. ఆశ్రమంలోని వేద పాఠశాల నుంచి వచ్చిన వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ జరిగిన మహా రుద్రాభిషేకం ఆహూతులకు అపూర్వ అనుభూతిని కలిగించింది. సంత్సంగ్ సంగీత విభావరి అందరినీ విశేషంగా ఆకట్టుకొన్నది.