హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ సందర్భంగా మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి నియోజకవర్గంలోకి తరలించిన వారితో పోలింగ్ ముగిసే సమయంలో కాంగ్రెస్ నేతలు భారీ స్థాయిలో దొంగ ఓట్లు వేయించినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపనాథ్పై కూడా కాంగ్రెస్ శ్రేణులు దౌర్జన్యానికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి, రౌడీషీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ బీఆర్ఎస్ నాయకులపై దాడికి దిగాడు. ఈ ఘటనలో కొందరికి దెబ్బలు తగిలినట్టు బీఆర్ఎస్ నేతలు చెప్పారు. దీంతో సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కృష్ణానగర్, యూసుఫ్‌గూడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, అధికారుల వైఖరికి నిరసనగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అభ్యర్థి సునీతాగోపీనాథ్, బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దొంగ ఓటర్లను తరిమికొట్టాల్సిన పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా మారి, బీఆర్ఎస్ పార్టీ నాయకులనే అక్కడి నుంచి పంపించివేయడం విస్మయం కలిగించింది.
కృష్ణానగర్‌లో దొంగ ఓట్లు..
పోలింగ్ సమయం ముగుస్తుందనగా 5గంటల సమయంలో అమరావతి స్కూల్లోని పోలింగ్ కేంద్రం వద్దకు కాంగ్రెస్ పార్టీ భారీగా దొంగఓటర్లను తరలిస్తున్నదనే సమాచారంతో స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్ అక్కడకు చేరుకున్నారు. దీంతో సుమారు 10 మంది క్యూలైన్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి ఓటరు గుర్తింపుకార్డులు కిందపడిపోయాయి. పోలీసులకు ఈ విషయాన్ని చెప్పినా ప్రయోజనం లేకపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత సతీశ్‌రెడ్డి తదితరులు అక్కడికి వచ్చి ఆందోళనకు దిగారు. ఇంతలోనే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీపినాథ్ కూడా వచ్చారు. దొంగ ఓటర్లను అప్పగించినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆమె వారి వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల తీరుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినదించారు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ బీఆర్ఎస్ నాయకులను సముదాయించి, మాగంటి సునీతను, ఆమె పిల్లలను అక్కడి నుంచి పంపించేశారు.
యూసుఫ్‌గూడలో ఆందోళన
యూసుఫ్‌గూడలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంటికి సమీపంలో ఉన్న మహమూద్ ఫంక్షన్ హాలులో పోలింగ్ సమయం ముగిసే సమాయానికి భారీ ఎత్తున దొంగ ఓటర్లను సమీకరించినట్టు సమాచారం అందింది. దీంతో మాగంటి సునీతా గోపీనాథ్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. దొంగ ఓటర్లను గుంపులు గుంపులుగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తుండటం కంటబడటంతో ఆమె వారిని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఆగడాలను ఎండగడుతూ దొంగ ఓట్లతో గెలువాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఆమె వెనుకే అక్కడికి చేరిన బీఆర్ఎస్ నాయకులు సైతం వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కొందరు తాము కళాకారులమంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు కూడా దొంగ ఓటర్లను పట్టుకోవడానికి, వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు.
ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడకు చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిలో కొందరు అక్కడినుంచి పరారయ్యారు. పోలీసులు వారికి వత్తాసు పలకడంతో వారి చర్యకు నిరసనగా మాగంటి సునీతా గోపినాథ్, తన ఇద్దరు కూతుళ్లు, కొడుకుతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు యూసుఫ్‌గూడలో రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ నాయకుల ఆగడాలను అడ్డుకోవాలంటూ పోలీసులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.
రౌడీషీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ దాడి..!
యూసుఫ్‌గూడలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహమూద్ ఫంక్షన్ హాల్ సమీపంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్ ఇల్లు కూడా ఉంది. బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేస్తున్న ప్రదేశానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు కూడా చేరుకున్నారు. వారి వెనకాలే కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, సోదరుడు వెంకట్‌యాదవ్ భారీ అనుచరగణంతో అక్కడికి వచ్చారు. అప్పటికే అక్కడికి వచ్చిన జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ ఇతర పోలీసు అధికారులు బీఆర్ఎస్ నేతలను సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, అటు కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇదే అదనుగా రెచ్చిపోయిన చిన్నశ్రీశైలం యాదవ్ పెద్దగా అరుస్తూ బీఆర్ఎస్ శ్రేణులపైకి దూసుకువచ్చాడు. ఎంపీ వద్దిరాజు రవిచంత్రోపాటు మహిళ అని కూడా చూడకుండా అభ్యర్థి సునీతా గోపీనాథ్‌పై దాడికి ప్రయత్నించాడు. దీంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. శ్రీశైలం యాదవ్‌కు బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుగా నిలవడంతో ఆయన పలువురిపై చేయి చేసుకున్నాడు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు.