Drinking Water | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్‌లపై ఆధారపడినవారు తాగునీటి ఎద్దడిని ఎదుర్కోనున్నారు. రెండింటిలో కలిపి ప్రస్తుతం నికరంగా 15 టీఎంసీల నీరే అందుబాటులో ఉండగా, అవసరాలు మాత్రం దాదాపు 25 టీఎంసీలకుపైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న జలాల పంపిణీ కోసం సోమవారం త్రీమెంబర్ కమిటీ సమావేశం నిర్వహించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు లేఖ రాసింది.
రిజర్వాయర్లు అడుగంటడంతో తెలంగాణకు తాగునీటికి తండ్లాట తప్పని దుస్థితి నెలకొన్నది. శ్రీశైలం నుంచి ఉమ్మడి మహబూబ్నగర్పాటు ఏడు జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంది. సాగర్‌పై హైదరాబాద్‌తోపాటు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. మే, జూన్ నెలల్లో నికరంగా రెండు ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు తాగునీటి కోసం దాదాపు 12-15 టీఎంసీలు అవసరం. కానీ ప్రస్తుతం ఆ మేరకు జలాలు అందుబాటులో లేవు.
నాగార్జునసాగర్ డెడ్‌స్టోరేజీ 510 అడుగులు కాగా ఆ లెవల్లో 131 టీఎంసీలు రిజర్వాయర్‌లో ఉంటాయి. ప్రస్తుతం సాగర్ మట్టం 514 అడుగులకు చేరుకోగా 138 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. అంటే 7 టీఎంసీల జలాలే వినియోగించుకునే అవకాశముంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ 834 ఫీట్లు కాగా, ఆ స్థాయిలో 57 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం ఇప్పటికే డెడ్‌స్టోరేజీ దిగువకు వెళ్లిపోయింది. ప్రస్తుతం రిజర్వాయర్ లెవల్ 814 ఫీట్లకు చేరుకోగా, డ్యామ్‌లో 37 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 800 ఫీట్ల నుంచి కూడా జలాలను వినియోగించుకునే వెసులుబాటు ఇరు రాష్ర్టాలకు ఉంది. ఆ స్థాయికి వెళ్లినా అప్పటికి డ్యామ్‌లో 29 టీఎంసీలు ఉంటాయి. అందులో నికరంగా వినియోగానికి అందుబాటులో ఉండే జలాలు 8 టీఎంసీలే. వెరసి రెండు రిజర్వాయర్లలో కలిపి ఇప్పటికి అందుబాటులో ఉన్నది 15 టీఎంసీలు మాత్రమే. ఆవిరి నష్టాలు, రవాణా నష్టాలు పోగా నికరంగా 12 టీఎంసీలకు మించి అందుబాటులో ఉండకపోవచ్చని అధికారులు వివరిస్తున్నారు. మరోవైపు మే, జూన్ నెలల్లో తాగునీటి కోసం ఇరు రాష్ర్టాలకు కలిపి దాదాపు 22 టీఎంసీల మేరకు అవసరమవుతాయి. అంటే దాదాపు 10 టీఎంసీల జలాలు కొరత ఏర్పడనున్నట్టు తెలుస్తున్నది.
ఈ ఏడాది కృష్ణాబేసిన్‌లో 845 టీఎంసీల మేరకు సముద్రంలో కలిశాయి. సముద్రంలో కలిసిన జలాలు పోగా దాదాపు ఇరు రాష్ర్టాలకు కలిపి 1023కు పైగా టీఎంసీలు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చాయి. అందులో ఏపీ ఇప్పటికే తన తాత్కాలిక కోటా 66 శాతానికి మించి 73 శాతం జలాలను తరలించుకుపోయింది. తెలంగాణ తాత్కాలిక కోటా 34 శాతం కాగా, ఆ జలాలను కూడా పూర్తిస్థాయిలో వాడుకోలేదు. ప్రస్తుతం నికరంగా 15 టీఎంసీలే అందుబాటులో ఉంటే అందులో నుంచి తాగునీటి అవసరాల కోసం తమకు 10 టీఎంసీలు కావాలని ఏపీ బోర్డుకు ఇండెంట్ పెట్టడం గమనార్హం.
రెండు ప్రధాన జలాశయాల్లో నీరు అడుగంటిపోయిన నేపథ్యంలో ఈ నీటి సంవత్సరంలో తొలిసారి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రీమెంబర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నది. జలసౌధలో 5న (సోమవారం) ఉదయం సమావేశం జరుగనున్నట్టు ఇరురాష్ర్టాలకు లేఖలు రాసింది. ప్రధానంగా రిజర్వాయర్ల నుంచి తాగునీటి వినియోగానికి సంబంధించిన అంశంపై చర్చించనున్నట్టు వెల్లడించింది. ఈ కమిటీ ప్రతి ఏటా సీజన్ల వారీగా ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. రాష్ర్టాల డిమాండ్లను, అందుబాటులో ఉన్న నీటినిల్వలను పరిగణనలోకి తీసుకొని ఇరు రాష్ర్టాలకు నీటివాటాలను కేటాయిస్తుంది. కానీ ఈ ఏడాది ఏ దశలోనూ త్రీమెంబర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. నీటివిడుదల ఆర్డర్లు ఇవ్వలేదు. ఏపీ జలాలను తరలించుకుపోతున్నదని తెలంగాణ ఫిర్యాదు చేసినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించింది.