Telangana Budget | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు. 2025-26 సంవత్సరానికి రూ.3,04,965 కోట్లతో ఆయన బడ్జెట్ పద్దును ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేరొన్నారు.
దాదాపు గంటన్నరుకుపైగా సాగిన బడ్జెట్ ప్రసంగంలో ఆయా రంగాలకు చేసిన కేటాయింపులను, ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలను చదివి వినిపించారు. తమ అసంబద్ధ విధానాలతో ఎదురైన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతూ, తమ 15 నెలల ప్రభుత్వ హయాంలో అంతా బాగున్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు అదే సమయంలో అసెం బ్లీ వ్యవహారాలు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు కూడా శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన ప్రసంగంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్, శ్రీశ్రీ కొటేషన్లను ప్రస్తావించారు.
‘నిజంకూడా రోజూ ప్రచారంలో ఉండాలి, లే దంటే అబద్ధం నిజంగా మారి రాష్ర్టాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది’ అని మంత్రి భట్టి పేర్కొన్నారు. కానీ తమ ప్రభుత్వం గత 15 నెలల్లో సంపూర్ణంగా అమలుచేసిన సంక్షేమ పథకాలకు సంబంధించిన నిజాలను ఒక్కటి కూడా చెప్పలేకపోయింది. ‘ప్రభుత్వం చేసే ప్రతి చర్యను శంకిస్తూ, నిరాధారమైన విమర్శలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో, సొంత పత్రికల్లో అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారు.
ఇటువంటి కువిమర్శలను సమర్థంగా తిప్పికొడుతూ, వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం మా బాధ్యత. నిజం ప్రజలకు చెప్పకపోతే, స్వార్థపరులు చేసే అబద్ధాలే నిజాలుగా భ్రమించే ప్రమాదం ఉంది. అందుకే, ఎప్పటికప్పుడు సత్యాలను ప్రజలముందు ఉంచుతూ ముందుకు సాగుతున్నాం’ అని మంత్రి పేర్కొన్నారు. కానీ రుణ మాఫీ జరగలేదని, రైతు భరోసా అందలేదని, సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయని ఓవైపు రైతులు నిరసన గళం వినిపిస్తుండగా, ఇతర ప్రభుత్వ పథకాలపై నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు ఏడాది కాలంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
‘భూమి అనేది ఒక స్థిరాస్తి మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం, భూమితో ఉన్న అనుబంధం కన్నతల్లితో, సొంత ఊరితో ఉన్న అనుబంధంతో సమా నం. ఒక వ్యక్తి తన భూమిని కోల్పోయినప్పుడు తన అస్తిత్వాన్నే పోగొట్టుకున్నట్టు భావిస్తాడు’ అని భట్టి పేర్కొన్నారు. ఓవైపు పేదలు, రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్న ప్రభుత్వం నిజంగానే వారి అస్తిత్వాన్ని కొల్లగొడుతున్నదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో తమ ప్రభుత్వం పలు పథకాలు అమలు కానివి కూడా అమలు చేసినట్టు పేర్కొనడం, కొన్ని ముఖ్యమైన పథకాలకు నిధులు అతి తక్కువగా కేటాయించడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించామని తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పదేండ్లలో ట్రిలియన్ (లక్ష కోట్ల) డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నామని చెప్పారు. చైనా ప్లస్ వన్ వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాములు ఏర్పాటు చేస్తామని, ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తామని తెలిపారు. ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామని చెప్పారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలుచేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగం ముగిశాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సీఎం రేవంత్‌రెడ్డి ఆలింగనం చేసుకొని అభినందించారు. అనంతరం మంత్రులు, అధికారపక్ష సభ్యులు భట్టి విక్రమార్కను అభినందించారు.