హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం కొనుగోళ్లు తిరోగమన దిశలో సాగుతున్నాయి. గత 4 సంవత్సరాల్లో రైతుల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా కోటి టన్నులకుపైగా ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. ఇప్పుడు రేవంత్ సర్కారు కనీసం కోటి టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేకపోయింది. ఎన్నో ఆపసోపాలు పడి ఈ ఏడాది మొత్తంగా 95.34 లక్షల టన్నుల (వానకాలంలో 47.34, యాసంగిలో 48 లక్షల టన్నులు) ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు తగ్గడం 2018-19 తర్వాత ఇదే ప్రథమం. దీంతో రాష్ట్రం ఐదేండ్లు వెనక్కి పోయింది. 2019-20లో ధాన్యం కొనుగోళ్లు తొలిసారి కోటి టన్నుల మార్కును దాటాయి. నాటి నుంచి 2022-23 వరకు ఏ ఏడాదిలోనూ ధాన్యం కొనుగోళ్లు కోటి టన్నులకు తగ్గలేదు. దీంతో ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లు తగ్గడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళిక లోపమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నాలుగేండ్లలో రికార్డులే రికార్డులు
రాష్ట్రంలోని వరి రైతులకు గత నాలుగేండ్లు స్వర్ణయుగమనే చెప్పుకోవాలి. వరి సాగుతోపాటు ధాన్యం కొనుగోళ్లలోనూ రికార్డుల మీద రికార్డులు నమోదయ్యాయి. రైతులు పోటీపడి ధాన్యం పండిస్తే.. వాటిని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ‘మీరు ఎంత పండిస్తారో పండించండి. మొత్తం కొనుగోలు చేస్తాం’ అన్నట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగింది. 2018-19లో 77.48 లక్షల టన్నులతో మొదలైన ధాన్యం కోనుగోళ్ల పరంపర 2019-20లో కోటి టన్నుల మార్కు దాటింది. ఆ ఏడాది ఏకంగా 1.11 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన పౌరసరఫరాల సంస్థ.. ఆ తర్వాత ఎన్నడూ వెనుదిరిగిందే లేదు. ఆ మరుసటి ఏడాది రికార్డు స్థాయిలో 1.41 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో ఏకంగా 92 లక్షల టన్నులు ఒక్క యాసంగిలోనే కొనుగోలు చేసింది. అది కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే ఈ రికార్డులు నెలకొల్పింది. ఆ తర్వాత 2021-22లో 1.21 కోట్ల టన్నులు, 2022-23లో 1.31 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కానీ, ఈ ఏడాది మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా తయారైంది. ‘మీరు ఎంతైనా పండించండి. మేం మాత్రం ఎంత కొనాలో అంతే కొంటాం’ అన్నట్టుగా రేవంత్ సర్కారు వ్యహరించింది.
వరి సాగు పెరిగినా.. తగ్గిన కొనుగోళ్లు
వాస్తవానికి గతంతో పోలిస్తే ఈ ఏడాది వరిసాగు పెరిగింది. అయినా ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. ఈ ఏడాది మొత్తం 1.15 కోట్ల ఎకరాల్లో (వానకాలంలో 65 లక్షలు, యాసంగిలో 50.69 లక్షల ఎకరాల్లో) వరి సాగైంది. నిరుడు 1.21 కోట్ల ఎకరాల్లో, 2021-22లో 97.79 లక్షల ఎకరాల్లో, 2020-21లో 1.06 కోట్ల ఎకరాల్లో, 2019-20లో 80.50 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు.