హనుమకొండ, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దిలావర్పూర్: అన్నదాతలకు మరో కష్టం వచ్చిపడింది. ప్రకృతి విపత్తులు ఈ సారి వరి రైతులను బాగా దెబ్బతీశాయి. నాట్లు వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు వానలు ఆగం చేశాయి. చేతికి వచ్చిన పంట ఇంటికి వచ్చే పరిస్థితి లేకుండా పోతున్నది. వరి కోతల విషయంలోనూ ఈ సారి ఎప్పుడూ లేనంత కష్టం వచ్చింది. వరద పొలాల్లో చేరడం, తేమ ఎంతకీ ఆరకపోవడం.. వడ్లు అలాగే ఉంటే మొలకెత్తే పరిస్థితి ఉన్నది. ప్రతిసారి టైర్ల మెషిన్లతో (Harvester) కోతలు పూర్తయ్యేవి. ఎక్కడో బాగా తేమ ఉండే ప్రాంతాల్లోనే వరి కోతలకు చైన్ ట్రాక్ మెషిన్లు అవసరమయ్యేవి.
వరుస వానలతో ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా పొలాల్లో నీరు అలాగే ఉంటున్నది. వారంలోపు కచ్చితంగా వరి కోతలు పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. వరి విస్తీర్ణానికి అవసరమైన చైన్ ట్రాక్ మెషిన్లు లేకపోవడంతో కోతలకు ఇబ్బంది కలుగుతున్నది. ప్రతి ఊర్లోనూ ఇప్పుడు వరికోత మెషిన్లకు బాగా డిమాండ్ ఉన్నది. చైన్ ట్రాక్ మెషిన్ల యజమానుల దగ్గరికి రైతులు వెళ్లి బతిమాలుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వడ్లు మొలకలు వచ్చే పరిస్థితి ఉండటంతో ట్రాక్ మెషిన్లకు డిమాండ్ పెరిగింది. ఇదే ఇప్పుడు రైతులకు మరిత భారంగా మారింది. వరి కోతల ఖర్చులు గతంలో రూ.20 వేలు ఉంటే ఇప్పుడు రూ.40 వేలకు పెరిగింది. పెట్టుబడి మినహా మిగిలేదే కొంత అంటే ఇప్పుడు వరి కోతలకు పెరిగిన ఖర్చులతో అన్నదాతలకు నష్టాలే మిగులుతున్నాయి.
పెరిగిన చైన్ ట్రాక్ మెషిన్ల అద్దె..
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చైన్ ట్రాక్ మెషిన్లకు డిమాండ్ వచ్చింది. ఇదే అదునుగా వాటి యజమానులు వరి కోతల చార్జీలను పెంచారు. గతంలో గంటకు ధర రూ.2,200 నుంచి రూ.2,500 ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.3,500 నుంచి రూ.4,500 వరకు పెంచేశారు. నేలవాలిన ఎకరం వరి కోతకు రూ.7 వేల నుంచి రూ.8 వేలు అవుతుంది. చైన్ ట్రాక్ మెషిన్ల కొరతతో ఈ సారి వరి కోతలు నెలల తరబడి కొనసాగే పరిస్థితి ఉన్నది. కొనుగోలు కేంద్రాలకు వడ్లు ఆలస్యంగా వస్తున్నాయి.
కోతల సమయంలో వచ్చిన వానలు వడ్లను తడపడంతో నూకలు ఎక్కువ అయ్యే పరిస్థితి ఉన్నది. గిట్టుబాటు ధర వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో టైర్ మెషిన్ గంటకు రూ.1,700 తీసుకుంటే, చైన్ మెషిన్‌కు రూ.3,500 తీసుకుంటున్నారు. ఎకరం పొలం కోసేందుకు రైతులు రూ.7 వేలకు పైగా ఖర్చవుతుందని వాపోతున్నారు.
మెషిన్లు దొరుకుతలేవు
నాకున్న రెండెకరాల పొలం వరదలో మునిగింది. పంట బాగా దెబ్బతిన్నది. వరద తగ్గినంక వరి కోపిద్దామంటే అంతా బురద ఉన్నది. ఇప్పట్లో ఆరే పరిస్థితి లేదు. టైర్ల మెషిన్లతో కోతలు అయ్యేటట్టు లేదు. చైన్ మెషిన్ కోసం ఎంత తిరిగినా దొరుకుతలేవు. వడ్లు మొలకొచ్చేటట్టు ఉన్నయి. – బండి సునీల్,నారాయణగిరి, హనుమకొండ జిల్లా
వడ్లు నల్లగ అయినయి..
వానల వల్ల మూడున్నర ఎకరాల వరి నీట మునిగిం ది. ఆరిపోయినంక ఇప్పుడు కోయిస్తున్నం. వడ్లు నల్లగ అయినయి. 7 ట్రాక్టర్లకు బదులు మూడు ట్రాక్టర్లే వచ్చినయి. అవి కూడా ఖరాబైనయి. అధికారు లు కనీసం పట్టించుకోలేదు. నిండా మునిగిపోయాం. పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
-దగ్గు రవీందర్రావు, వలభాపూర్, హనుమకొండ జిల్లా