హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణను ఆగం చేసిన కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజలు, సబ్బండ వర్ణాలు అడుగడుగునా తిరగబడుతున్నారు. దీంతో ఈసారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు భారీగా పోలీసులను మోహరించారు. అసెంబ్లీ చుట్టుపక్కల లక్డీకాపూల్, రవీంద్రభారతి, నాంపల్లి తదితర ప్రాంతాల్లో అడుగడుగునా పోలీసులే కనిపిస్తున్నారు. శాసనసభ సమావేశాలు సజావుగా సాగేందుకు ఆందోళనకారులను ఆడ్డుకోవాలనే స్పీకర్ ఆదేశించడంతో ఈ చర్యలు చేపట్టినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచ్ల సంఘం పిలుపునివ్వడంతో సోమవారం ఉదయం దాదాపు 1000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.