Telangana | ఒకటి శతాధిక వసంతాల పార్టీ, ఇంకోటి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగి ఉన్నామని చెప్పుకొనే పార్టీ.. అదేలెండి కాంగ్రెస్, బీజేపీ! హస్తినలో తమదే హవా అనే ఈ పార్టీలు తెలంగాణ గల్లీలో బొక్కబోర్లా పడటం మామూలైపోయింది! ఏదో గాలివాటంగా చెప్తున్న మాటలు కావివి. గత ఎన్నికల గణాంకాల చిట్టా విప్పితే బడా రాజకీయ పక్షాల బలమెంతో తేటతెల్లం అవుతుంది.
గతంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిసి 286 స్థానాల్లో పోటీచేయగా.. 192 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 2018 తెలంగాణ ఎన్నికల బరిలో 117 స్థానాల్లో ఘనంగానే పోటీ చేసింది. తీరా ఫలితాలు వచ్చేసరికి 102 స్థానాల్లో డిపాజిట్ గల్లంతైంది. కాషాయ దళం పరిస్థితి చూస్తుంటే ధరావతు ఘాతం గతంలో కన్నా బలంగానే తాకేలా ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా! 2018లో వివిధ జాతీయ పార్టీల తరఫున మొత్తంగా 373 మంది బరిలో నిలవగా 259 మంది కనీస డిపాజిట్‌కు కావాల్సిన ఓట్లను పొందలేకపోయారు. ఇతర చిన్నాచితకా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 1308 మంది ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోగా 1301 మంది డిపాజిట్ మార్క్ అందుకోలేక చతికిలపడ్డారు. ఇతర రాష్ర్టాల్లో గుర్తింపు పొందిన పార్టీలు తమ రాజకీయ ఉనికి కోసం, పార్టీ విస్తరణ ఆకాంక్షతో బరిలో నిలుస్తున్నాయి. ఇక్కడి ప్రధాన పార్టీల్లో టికెట్ పొందలేని అభ్యర్థులు, స్థానికేతర పార్టీల బీఫారాలను చేజిక్కించుకొని పోటీలో నిలుస్తున్నారు. అయితే వారిలో అత్యధికులు డిపాజిట్ కోల్పోయి.. ‘అయ్యయ్యో! చేతిలో డబ్బులు పోయెనే..’ అని భారంగా పాటందుకుంటున్నారు.
…? నెలకుర్తి శ్రీనివాస్‌రెడ్డి