హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): వాంకిడి గురుకుల విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, తమ తప్పేం లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించినంత మాత్రాన విద్యార్థిని ప్రాణం తీసిన పాపం ఊరికేపోదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజాప్రతినిధుల హౌస్ అరెస్టులు, మీడియాపై ఆంక్షలు విధిస్తున్న తీరును ఆయన ఎక్స్ వేదికగా ఖండించారు. వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు వారి గ్రామానికి వెళ్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహా ఇతర ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మీడియాను సైతం గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో బారికేడ్లు వేసి అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజ్యాంగ దినోత్సవం అంటూ దేశ వ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్నాం కానీ, ఆ రాజ్యాంగ సూత్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొకుతున్నదని మండిపడ్డారు. ఇదేనా ప్రజాపాలనా? నిర్బంధించటమే విధానమా? అని ఆయన ప్రశ్నించారు.
వరుస ఫుడ్ పాయిజన్ కేసులతో విద్యార్థులు మరణిస్తున్నా సర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు వందమంది విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్ జరిగి, పది రోజులు కూడా గడవకముందే నారాయణపేట జిల్లా మాగనూరు హైస్కూల్లో ఆహారం కలుషితమై 30 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో దవాఖానలో చేరడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని విమర్శించారు. ఇంకెంత మంది విద్యార్థులు దవాఖానల పాలు కావాలి? ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి? అని ప్రశ్నించారు.