Mallanna Sagar | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): నరంలేని నాలుక.. ఏదైనా మాట్లాడొచ్చు! కానీ కాగితాల మీద రాతలు, అంతకుమించి ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీ చేసిన వ్యాఖ్యలు ప్రజల మదిలో రికార్డవుతాయి. నాడో తీరుగ నేడో రీతిగ మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతంలో వందలాది టీఎంసీల నీటి నిల్వ రిజర్వాయర్లు నిర్మించుకుంటే నోరు మెదపని అప్పటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 50 టీఎంసీలతో మల్లన్నసాగర్‌ను ప్రతిపాదిస్తే చేసిన రాద్దాంతం అంతాఇంతా కాదు. ‘బ్రహ్మాండం బద్దలవుతుంది.. భూకంపం వస్తుంది’ అంటూ మీడియా ముందు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చిన దృశ్యాలు ఇంకా తెలంగాణ సమాజం యాదిలోనే ఉన్నాయి. కానీ అధికారంలోకి రాగానే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నాలుక మడతేసింది. నాడు భూకంప కేంద్రంగా ఉన్నదన్న మల్లన్నసాగర్నే ఇప్పుడు ఆ పార్టీ బ్రహ్మాండమని చెప్తున్నది. హైదరాబాద్ మహానగర దాహార్తి తీర్చేందుకు మల్లన్నసాగరే శరణ్యమంటూ అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నది. మరి నాడు చేసిన ఆరోపణలు నిజమా? నేడు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నది వాస్తవమా? కాంగ్రెస్ నేతలు స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. కొండపోచమ్మ సాగర్ నుంచి తక్కువ దూరంలో, తక్కువ వ్యయంతో అయ్యే హైదరాబాద్ మంచినీటి పథకాన్ని దూరం, వ్యయ భారాలు పెంచి మల్లన్నసాగర్‌కు మార్చడంపై పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దేశ సాగునీటి రంగ చరిత్రలోనే తక్కువ సమయంలో రైతులకు ఫలాలు అందించిన బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 2019లో ప్రారంభమై తెలంగాణలో లక్షలాది ఎకరాల బీడు భూములకు జీవం పోసింది. దురదృష్టవశాత్తు మేడిగడ్డ బరాజ్‌లో పిల్లర్ల కుంగుబాటు ఘటనతో కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం ప్రాజెక్టును బదనాం చేసే కుట్ర చేసింది. ఇందుకు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలనే పణంగా పెట్టింది. గత యాసంగిలో ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టు మోటర్లను నడపకుండా లక్షలాది ఎకరాలను ఎండబెట్టింది. ఈ వానకాలంలోనూ అదేరీతిన వ్యవహరించేందుకు సిద్ధమైనా బీఆర్ఎస్ ఒత్తిడి, రైతుల ఆందోళనలతో ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ క్రమంలో వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని గుర్తించలేదా? అనే అనుమానాలు నిన్నటివరకు కాస్తోకూస్తో ఉండేవి. కానీ రెండు రోజుల కిందటితో అనుమానాలు పటాపంచలయ్యాయి. హైదరాబాద్ మహానగర తాగునీటి కోసం రెండో దశ గోదావరిజలాల తరలింపు పథకానికి పాలనా ఆమోదాన్నిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో చెప్పకనే కాళేశ్వరం గొప్పతనాన్ని అంగీకరించాల్సి వచ్చింది. అంతేకాదు.. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌పై గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు, అపవాదులను ఆ ప్రభుత్వమే కొట్టిపారేస్తూ దానిని జల భాండాగారంగా అభివర్ణించింది.
హైదరాబాద్ భవిష్యత్తు తాగునీటి అవసరాలకు పది టీఎంసీలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన మూసీ సుందరీకరణ కోసం మరో ఐదు టీఎంసీల గోదావరిజలాల తరలింపునకు ప్రభుత్వం రూ.5,560 కోట్లతో తాగునీటి పథకానికి ఆమోదం తెలిపింది. అధికారంలోకి వచ్చింది మొదలు.. కాళేశ్వరం ప్రాజెక్టు వృథా అంటూ నిత్యం ఆరోపణలు చేసే ప్రభుత్వ పెద్దలు ఈ తాగునీటి పథకానికి కాళేశ్వరం జలాలనే ఆధారంగా చేసుకోవడం విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ బరాజ్ మాత్రమే కాదు, మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు ఉన్న అనేక రిజర్వాయర్లు, పంపుహౌస్‌లు, టన్నెల్స్, కాల్వలు అంటూ ఆదినుంచీ బీఆర్ఎస్ చెప్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ తాగునీటి పథకానికి ఆధారంగా చేసుకున్న మల్లన్నసాగర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే గోదావరిజలాలు తరలివస్తాయి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై హైదరాబాద్ భవిష్యత్తు ఆధారపడి ఉందని అధికారికంగానే ధ్రువీకరించింది. ముఖ్యంగా కొన్ని మార్పులు చేసినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన తీరుగానే హైదరాబాద్ తాగునీటి పథకం, మూసీ ప్రక్షాళనకు గోదావరిజలాలను తరలించేందుకు నిర్ణయించింది. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో కేసీఆర్ ముందుచూపుతో వ్యవహరించడం వల్లనే సాధ్యమైందని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ముందుచూపు ప్రదర్శించకుంటే ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా వందల కిలోమీటర్ల నుంచి కృష్ణా, గోదావరిజలాల తరలింపు కోసం పథకాలు చేపట్టాల్సి వచ్చేదని చెబుతున్నారు.
తక్కువ దూరం, తక్కువ వ్యయంతో కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన కొండపోచమ్మసాగర్ సోర్స్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైప్‌లైన్ దూరాన్ని పెంచడంతో పాటు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకే మల్లన్నసాగర్ సోర్స్‌ను ఎంచుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ గతంలో మాదిరిగా కొండపోచమ్మసాగర్‌ను డిజైన్‌లో కొనసాగించి ఉంటే అంచనా వ్యయం రూ.1000 కోట్ల కంటే ఎక్కువగానే తగ్గేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మల్లన్నసాగర్‌ను ఎంచుకోవడం వల్ల ప్రజాధనాన్ని వృథా చేయడమే అవుతుందని స్పష్టంచేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు కేవలం పెన్నా బేసిన్లోనే 350 టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించారు. ఇందులో 30-60 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లున్నాయి. కానీ తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులు మినహా పట్టుమని పది టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్లు లేవు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో 50 టీఎంసీల మల్లన్నసాగర్ చేపట్టారు. కానీ దీనివల్ల భూకంపాలు వస్తాయని, 50 టీఎంసీల నిల్వ అనేది అసాధ్యమని కాంగ్రెస్ నేతలు, ఇతరులు అనేక అడ్డంకులు సృష్టించారు. కాంగ్రెస్ నాయకులు హోటళ్లలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ తాగునీటి పథకంలో నీటి వనరు (సోర్స్) మార్పునకు కారణాన్ని మాత్రం కొండపోచమ్మసాగర్ 15 టీఎంసీలే, మల్లన్నసాగర్ 50 టీఎంసీలు అయినందున నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందంటూ అధికారిక ఉత్తర్వుల్లో సూత్రీకరిస్తున్నారు. దీంతో గతంలో కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు, ప్రజలను మభ్యపెట్టేందుకు చేసిన భూకంప భ్రమలు అన్నీ వట్టి బూటకమేనన్న వాస్తవాన్ని వాళ్లే అంగీకరించినట్టయిందని నిపుణులు అంటున్నారు.