హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణం మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నది. థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి విడుదల కావాల్సిన అదనపు రుణం విడుదల కాకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తున్నది. పైగా జెన్కో విడుదల చేయాల్సిన వాటా మొత్తాన్ని విడుదల చేస్తేనే అదనపు రుణం నిధులను విడుదల చేస్తామంటూ రుణానికి హామీ ఇచ్చిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) స్పష్టంగా చెప్పడంతో జెన్కో ఎటూ పాలుపోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. 4000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణం మొన్నటి వరకు శరవేగంగా సాగింది. కొద్దిరోజుల నుంచి థర్మల్ ప్లాంటు నిర్మాణ పనుల్లో వేగం పూర్తిగా మందగించింది. దీనికి జెన్కో తన వాటాగా చెల్లించాల్సిన మొత్తం చెల్లించకపోవడమే తక్షణ కారణమని తెలుస్తున్నది. డిసెంబర్ నుంచే ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో.. ప్రభుత్వం నుంచి రావాల్సిన హామీలు, ఆర్థిక సహాయం అందడం లేదని సమాచారం.
7500 కోట్ల రుణం నిలిపివేత
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్తో తెలంగాణ జెన్కో కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం.. అదనపు రుణం నిధులను విడుదల చేయాలి. ఇందుకు సంబంధించి ఇప్పటికే రూ.1,600 కోట్లను తెలంగాణ జెన్కో తన వాటాగా విడుదల చేసింది. మరో రూ.345 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నది. ఈ మొత్తం విడుదల చేయకపోవడంతో.. పీఎఫ్సీ రూ.7,500 కోట్ల అదనపు రుణం నిధులను నిలిపివేసి.. మీ వాటాగా విడుదల చేయాల్సిన మొత్తం చెల్లించిన తర్వాతే అదనపు రుణంవిడుదల చేస్తామంటూ మెలిక పెట్టింది.
ఇదిలా ఉండగా.. పీఎఫ్సీ నుంచి అదనపు రుణం నిధులు నిలిచిపోవడంతో గత నెల నుంచి నిధుల లేమితో జెన్కో బిల్లులను చెల్లించడం లేదని సమాచారం. కొద్దిరోజుల క్రితం డిప్యూటీ సీఎం సమక్షంలో జరిగిన సమీక్ష సమావేశంలోనూ ఇదే విషయం చర్చకు వచ్చినట్టు తెలిసింది. నిర్మాణ పనులు చేస్తున్న బీహెచ్ఈఎల్ ప్రతినిధులుకూడా డిప్యూటీ సీఎం సమక్షంలోనే పెండింగు బిల్లులను చెల్లించాలని జెన్కో అధికారులకు సూచించారు. పీఎఫ్సీ నుంచి రావాల్సిన అదనపు రుణ నిధుల గురించి ఈ సందర్భంగా జెన్కో అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రానట్టు సమాచారం. దీంతో థర్మల్ కేంద్రం నిర్మాణ పనుల్లో ఎలాంటి కదలిక రాలేదు. స్తబ్ధత అలాగే కొనసాగుతున్నది.
ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని బీహెచ్ఈఎల్కు భరోసా ఇచ్చి.. అవసరమనుకొంటే తక్షణమే ప్రభుత్వం వాటా నిధులకు హామీగా నిలబడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని నిపుణులు అంటున్నారు. అలాంటి భరోసా ప్రభుత్వం నుంచి వచ్చి ఉంటే.. పనుల్లో వేగం పెరిగేదని, తద్వారా తొందరగా నిర్మాణ పనులు పూర్తిచేయాలనే ప్రభుత్వం ఆలోచన అమలయ్యేదని వారంటున్నారు. ఆర్థిక సమస్యలున్నాయని అంటున్న ప్రభుత్వమే.. వాటిలో తక్షణం పరిష్కరించాల్సిన అంశాలపై దృష్టి సారించకపోతే.. నిర్మాణం కుంటుపడుతుందని, తద్వారా థర్మల్ విద్యుత్తు కేంద్రం వ్యయం పెరిగి.. అంతిమంగా వినియోగదారుడిపై అధిక చార్జీల భారం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జెన్కోకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే.. వెంటనే పీఎఫ్సీ అదనపు రుణం విడుదల చేస్తుందని, దీంతో పనులు వేగంగా చేయవచ్చని, తద్వారా ప్రభుత్వం లక్ష్యం నెరవేరడంతోపాటు వినియోగదారులపై మోపే భారాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.