మక్తల్ : ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అపహాస్యమవుతుంది. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం ముష్టిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సబ్ సెంటర్ను స్థానిక నాయకుల ఒత్తిళ్లతో మంగళవారం ఉదయం తొలగించారు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కోసం మక్తల్ మండలంలో ఐకేపీ ద్వారా, జక్లేర్, భూత్పూర్, మంతన్ గౌడ్ గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మక్తల్ మండలం సత్యవార్ గ్రామంలో ఆలస్యంగా ఐకేపీ సిబ్బంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ అనుకున్న రీతిలో ధాన్యం లేకపోవడంతో సిబ్బంది మక్తల్ మండలం ముష్టిపల్లి గ్రామంలో ప్రారంభించారు.
గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొందరు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదులు చేశారు. ఒక వర్గానికి చెందిన రైతుల వడ్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు చేయడంతో ఆయనతో పాటు అధికారుల ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేశారు.
ఇప్పటికే రైతులు ధాన్యం విక్రయానికి ఎదురుచూపులు చూస్తుండగా గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఎత్తివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఈదురు గాలులు, వర్షాలు ఉన్న సమయంలో రైతుల కష్టాలను అర్థం చేసుకోకుండా కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేయడంపై ఎమ్మెల్యే రైతులకు సమాధానం చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల ఆదేశాలతో ప్రారంభం.. తొలగింపు
సమైక్య ఏపీఎం వనజమ్మను నమస్తే తెలంగాణ ప్రతినిధి వివరణ కోరగా యాసంగి సీజన్లో ఐకేపీ ద్వారా ముష్టిపల్లి గ్రామంలో సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మంగళవారం ఉదయం వరకు కేంద్రాన్ని ఎత్తివేయాలని సమాచారం రావడంతో తొలగించామని వెల్లడించారు.