హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ కలల ప్రాజెక్ట్ అయిన యాదాద్రి పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్లాంట్ అయిన వైటీపీఎస్ను దేవాలయంగా అభివర్ణించారు. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే కరెంటు రాష్ట్ర జీడీపీని పెంచేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. వైటీపీఎస్ భూ నిర్వాసితులకు ఉద్యోగపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం బేగంపేటలోని ప్రజాభవన్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వైటీపీఎస్‌లోని మిగతా మూడు యూనిట్లను డిసెంబర్ కల్లా అందుబాటులోకి తీసుకొచ్చి, జనవరి 15 కల్లా మొత్తం వైటీపీఎస్ను జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 335 మందికి వైటీపీఎస్‌లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ప్లాంట్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, హౌజ్ కీపర్లుగా ఉద్యోగ నియమాకపత్రాలు, మరో 151 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): మహిళా పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. వీరి సంక్షేమం కోసం చేసే సిఫారసులను అమలుచేసేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. మహిళా పోలీసులో మహిళ అనే పదాన్ని తొలగించాలన్న సిఫారసు మంచి ఆలోచనని, ఈ సిఫారసుతో ఏకీభవిస్తున్నానని వెల్లడించారు. తెలంగాణ పోలీసు అకాడమీలో శుక్రవారం మహిళా పోలీసు సదస్సు ముగింపు కార్యక్రమానికి భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా పోలీస్ సిబ్బంది సమస్యలపై త్వరితగతిన కమిటీ వేసి నివేదికను ప్రభుత్వానికి అందిస్తే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే, పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు బాగుండాలని వెల్లడించారు. అంకిత భావంతో పనిచేసే పోలీసు సిబ్బంది ఉన్నప్పుడే శాంతిభద్రతలు బాగుంటాయని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా ఎదిగిందని చెప్పారు. కాగా, సదస్సుకు హాజరైన భట్టి విక్రమార్క ముందు మహిళా పోలీసులు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. ఉన్నతాధికారుల నుంచి లైంగిక వేధింపులు, పని ప్రదేశంలో రక్షణ లేకుండా పోవడం, మహిళా అనే చిన్నచూపు, స్టేషన్లలో రిసెప్షన్‌కు పరిమితం చేయడం తదితర సమస్యలను భట్టి దృష్టికి తీసుకొచ్చారు.