హైదరాబాద్: రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. భోజన విరామం తర్వాత 2 గంటలకు ఓట్ల లిక్కింపు ప్రారంభిస్తారు. అనంతరం విజేతలను ప్రకటించనున్నారు. చివరిదైన మూడో విడతలో మొత్తం 4,159 గ్రామపంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో వివిధ కారణాలతో 11 జీపీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. హైకోర్టు ఆదేశాలతో 2 గ్రామాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మరో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,752 గ్రామాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 53,06,401 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుషులు 26,01,861మంది, మహిళలు 27,04,394 మంది, 140 మంది ఇతరులు ఉన్నారు. తుది విడత మొత్తం 36,452 వార్డుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో 116 వా ర్డులకు నామినేషన్లు పడలేదు. మరో 7,908 వా ర్డులు ఏకగ్రీవమవగా, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మిగిలిన 28,410 వార్డులకుగాను 75,725 మంది పోటీలో ఉన్నారు.
జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో తుది విడత సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతున్నది. మొత్తం ఐదు మండలాల్లో 75 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఏడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎంపిక కావడంతో, మిగిలిన 68 గ్రామ పంచాయతీలలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ 68 గ్రామ పంచాయతీలలో మొత్తం 207 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుండగా.. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, ఊట్కూర్, నర్వ, మాగనూర్, కృష్ణ మండలాల్లో పంచాయతీ ఎన్నిక కొనసాగుతున్నది. చలి తీవ్రతను లెక్కచేయకుండా వృద్ధులు, మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.

వేల్పూర్లో..
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో పంచాయతీ సందడి నెలకొంది. మండలంలోని 18 పంచాయతీలకు గాను 4 గ్రామ పంచాయతీల (అంక్సపూర్, హనుమాన్ నగర్, జాన్కంపేట, కొత్తపల్లి) సర్పంచులు, వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 14 గ్రామపంచాయతీలలో పోలింగ్ జరుగుతున్నది. ఈ స్థానాలలో 46 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 180 వార్డులకు గాను 67 వార్డులు ఏకగ్రీవమవగా, మిగిలిన 113 వార్డులలో 271 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మండలంలో మొత్తం 37,476 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 17139 మంది, మహిళలు 20,337 మంది ఉన్నారు.
