వినాయక నగర్, జూన్ 15 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హరియాణా రాష్ట్రానికి చెందిన దోపిడీ ముఠా హల్ చల్ సృష్టించింది. అర్ధరాత్రి ఆలయంలో దోపిడీకి యత్నించారు. మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని హమాల్ వాడి ప్రాంతంలో గల సాయిబాబా ఆలయంలోకి ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు దోపిడీ దొంగలు ఆలయంలో హుండీతో పాటు ఇతర నగలను దొంగిలించేందుకు ప్రయత్నించారు. తమ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డు, సుత్తితో ఆలయం డోర్లను ధ్వంసం చేస్తుండగా భారీగా శబ్దం రావడంతో ఆలయం చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్నవారు మేల్కొని వెంటనే డయల్ 100 కు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న ఎస్సై హరిబాబు, నైట్ పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన ఆలయం వద్దకు చేరుకున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన దొంగల ముఠా సభ్యులను పట్టుకున్నట్లు తెలిసింది. ఈ చోరీ ఘటనపై సాయిబాబా ఆలయ పూజారి కృష్ణమాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.