Electricity Deportment | హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ఒకరికి అర్హతలే లేవు.. మరొకరికి మూడింటిలో రెండు అర్హతలు లేనేలేవు.. ఓ సంస్థకు వచ్చిన 55 దరఖాస్తుల్లో ఏడుగురు అనర్హులు ఉన్నారు.. ఇలా విద్యుత్తు సంస్థల డైరెక్టర్ల ఎంపిక కోసం అర్హతలు లేకున్నా ఇంటర్వ్యూలకు పిలిచారు. దీన్నిబట్టి భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులను పక్కనబెట్టి అనర్హులకు డైరెక్టర్ పోస్టులు కట్టబెట్టబోతున్నట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారిందని, కొందరు రూ.కోట్లు సమర్పించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్‌కో, జెన్కో, దక్షిణ, ఉత్తర డిస్కంల పరిధిలో డైరెక్టర్ల నియామకానికి 2024 జనవరిలో దరఖాస్తులను ఆహ్వానించారు. నిబంధనల ప్రకారం డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసే వారి వయస్సు 62 ఏండ్లకు మించవద్దు. విద్యుత్తు రంగంలో కనీసం 15 ఏండ్ల అనుభవం గలవారై ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో కనీసం 25 ఏండ్ల అనుభవం గల వారై ఉండాలి. ఆయా వ్యక్తులు చీఫ్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా మూడేండ్ల సర్వీసు పూర్తిచేసుకుని ఉండాలి. లేదా ప్రభుత్వరంగ సంస్థల్లో చీఫ్ జనరల్ మేనేజర్ లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసి ఉండాలి. వీరికి నెలకు రూ.1.50 లక్షల చొప్పున వేతనాలు, రూ.30 వేల నిర్వహణ ఖర్చులకు ఇస్తారు. ఏటా 10 శాతం ఇంక్రిమెంట్ ఉంటుంది.
16 పోస్టులకు 150 దరఖాస్తులు
ట్రాన్స్‌కోలో 3, జెన్కోలో 5, ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలో 4, దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలో 4 చొప్పున మొత్తం 16 డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరించారు. ఈ నాలుగు సంస్థల్లో డైరెక్టర్ పోస్టులకు దాదాపు 150 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులకు ఈ నెల 9, 10 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే పైన పేర్కొన్న అర్హతల్లేని కొందరిని ఇంటర్వ్యూలకు పిలవడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఇంటర్వ్యూలు పూర్తికాగా, ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున షార్ట్‌లిస్టు చేసి ప్రభుత్వానికి కమిటీ సిఫారసు చేసే పనిలో ఉన్నది. ఆ తర్వాత వీరిలో ఒకరిని డైరెక్టర్‌గా నియమిస్తారు.
కోట్లు ముట్టజెప్పినట్టు గుసగుస!
విద్యుత్తు సంస్థల్లో డైరెక్టర్ పోస్టులకు భారీ గిరాకీ పలికిందని విద్యుత్తు శాఖ ఇంజినీర్లలో విస్తృత ప్రచారం జరుగుతున్నది. సీఎండీ తర్వాత డైరెక్టర్ పోస్టులే కీలకం కావడంతో భారీ మొత్తంలో చేతులు మారాయని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఆపరేషన్స్ డైరెక్టర్ పోస్టుకు తీవ్ర డిమాండ్ ఉన్నదని వినికిడి. ఒక్కో పోస్టుకు కొందరు రూ.రెండు, రూ.మూడు కోట్లు సమర్పించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ మొత్తంలో చేతులు మారడంతోనే ఇంటర్వ్యూ జాబితాలో అనర్హుల పేర్లు చేరాయని అంటున్నారు. అర్హతలు ఉన్న వారితోపాటు లేని వారిని సైతం ఇంటర్వూలకు పిలవడమేమిటని ఇతరులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కొందరు ప్రభుత్వ పెద్దల జోక్యం ఉన్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి ప్రమేయంతోనే అనర్హులను ఇంటర్వ్యూ చేశారని, వారికే డైరెక్టర్ పోస్టులు ఖాయం అవుతాయని చర్చించుకుంటున్నారు. నోటిఫికేషన్ నిబంధనలు మార్చకుండా, అనర్హులను ఇంటర్వ్యూలకు పిలవడం వెనుక ముందస్తు కుట్ర దాగి ఉన్నదని ఇతర ఇంజినీర్లు భగ్గుమంటున్నారు. ముందే నిబంధనలు మారిస్తే, తాము కూడా దరఖాస్తు చేసుకునే వారిమని, దీనిపై కోర్టులో తేల్చుకుంటామని కొందరు ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు.
కొన్ని ఉదాహరణలు ఇలా..