వరంగల్ చౌరస్తా, ఆగస్టు 13: అస్వస్థతతో వైద్యం కోసం హాస్పిటల్కు వస్తే యంత్ర పరికరాలు అందుబాటులో లేవంటూ రోగిని బయటకు గెంటేసిన అమానవీయ ఘటన వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో చోటుచేసుకున్నది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరుకు చెందిన బాచబోయిన రత్నాకర్ కడుపు నొప్పి భరించలేక భార్య బుచ్చమ్మను వెంటబెట్టుకొని సోమవారం ఎంజీఎంకు వచ్చాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు పైల్స్ సమస్య ఉన్నట్టు గుర్తించారు. అయితే, యంత్రపరికరాలు లేవంటూ సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్కు వెళ్లాలని నోటి మాటగా చెప్పారు. దీంతో బాధితులు మూడు రోజులుగా ఎంజీఎం అత్యవసర విభాగం ఎదురుగా ఉన్న రేకులషెడ్డులోనే వేచి ఉన్నారు. బుధవారం మీడియాకు తెలియడంతో వారు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్కుమార్ను వివరణ కోరగా విషయం బయటకు వచ్చింది. స్పందించిన వైద్యాధికారులు బాధితుడిని అత్యవసర విభాగంలో చేర్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితుడికి పైల్స్ సమస్య అధికమవ్వడంతోపాటు ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్కు సిఫారసు లేఖ రాసి బాధితుడికి అందజేశారు.