హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులను క్రమబద్దీకరించాలనే డిమాండ్‌తో 11 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. ఈ విషయంలో కాంగ్రెస్ పాలకులు మెట్టు దిగకపోవడంతో కాంట్రాక్టు అధ్యాపకులు రగిలిపోతున్నారు. వర్సిటీల్లోని అసిస్టెంట్ అధ్యాపకుల పోస్టుల కోసం ప్రభుత్వం జీవో-21 విడుదల చేసింది. దీంతో 12 యూనివర్సిటీల్లో రెండు దశాబ్దాలుగా కాంట్రాక్టు అధ్యాపకులుగా పని చేస్తున్న వారి పోస్టులు ప్రమాదంలో పడ్డాయి. వాటిని రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తమ పోస్టులు క్రమబద్దీకరించాలని 11 రోజులుగా తెలంగాణ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. వర్సిటీలవారీగా బ్యానర్లతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
సమ్మెకు బీఆర్ఎస్ సహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అధికార పార్టీకి చెందిన కేకే, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కూడా ఆ సంఘం నాయకులు చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ సర్కారు ఒక్క మెట్టు కూడా దిగకుండా.. కనీసం చర్చలు జరుపకుండా.. పూర్తి నిర్లక్ష్యం వహిస్తుండటంపై మండిపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు వెనక్కి తగ్గేదే లేదని ఆ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ ధర్మతేజ, పరశురామ్, విజేందర్‌రెడ్డి, కుమార్, గోపకాని ఆనంద్, ఈ ఉపేందర్, వెల్పుల కుమార్ స్పష్టంచేస్తున్నారు.