హనుమకొండ, జనవరి 12 : ‘గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వరంగల్ నగరానికి అపారనష్టం తెచ్చింది. ఉమ్మడిగా ఉన్న జిల్లాను ఇష్టానుసారంగా విభజించడంతో ఎలాంటి ప్రయోజనం లేదు. జిల్లాల విభజనపై గతంలోనే అనేక వేదికలపై తాను అభిప్రాయాన్ని వ్యక్తంచేశాను. ఇప్పటికే జిల్లా నేతలందరూ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే విలీనం చేసే అవకాశం ఉన్నది’ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు.
హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలిపి వరంగల్ మహానగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షతన హనుమకొండలోని ఏకశిలా పార్క్ వద్ద ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్, పౌర సంఘాలు చేపట్టిన దీక్షకు ఆయన మద్దతు పలికి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలను విభజించడంతో వరంగల్‌కు చెందిన చారిత్రక కట్టడాలు, వైభవోపేతమైన భవనాలు తమ ఉనికిని కోల్పోతున్నాయని పేర్కొన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని 11, 29 డివిజన్లు వరంగల్ జిల్లాలో ఉండగా, మొత్తం నియోజకవర్గం హనుమకొండ జిల్లాలో ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.