Telangana | నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 18: తెళ్లారితే బుక్కెడంత తిని.. సద్దికట్టుకుని పొలంబాట పట్టే రైతన్న… తిండి, నిద్ర మానుకుని సొసైటీ ఆఫీసుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తున్నది. నాట్లేసి నెలదాటినా యూరియా బస్తాల కోసం ఎదురుచూస్తున్నరు. సరిపడా స్టాక్ లేదని అధికారులు చేతులెత్తేయడంతో పంటపై రంది పెట్టుకున్నరు. అదను దాటితే పొలం ఆగమైతదని ఆందోళన చెందుతున్నరు. పంటను కాపాడుకోవాలనే ఆరాటంతో… ముందురోజు రాత్రే సంఘం కార్యాలయానికి వెళ్లి.. యూరియా కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నరు. ఇదిగో అదిగో.. ఇప్పుడు అప్పుడు.. అంటూ సిబ్బంది కాళ్లరిగేలా తిప్పుతున్నా… ఓపికతో భరిస్తున్నరు. నిద్రాహారాలు మానుకుని అవస్థలు పడుతున్నరు. కాంగ్రెస్‌కు ఓటేసిన పాపానికి… కంటిమీద కునుకు లేకుండా పోయిందని కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో కర్షకులు నిప్పులు చెరుగుతున్నరు.
యూరియా ఇవ్వండి మహాప్రభో!
ఏం జరిగింది : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నూర్‌లోని సహకార సంఘం కార్యాలయం వద్ద సోమవారం యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. ఒక్కొక్కరికి ఒకే బస్తా ఇస్తుండటంతో ఆవేదన వ్యక్తం చేశారు. 30 గ్రామాలకు చెందిన రైతులు పెద్దఎత్తున బారులు తీరగా, కేవలం 888 బస్తాలే ఉన్నాయని అధికారులు స్పష్టంచేశారు. యూరియా అన్ని ఎరువుల దుకాణాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకున్నారు.
ఎదురుచూపులు.. తీరని ఆశలు
మంచిర్యాల జిల్లా కోటపల్లి, పారుపల్లి
ఏం జరిగింది: మంచిర్యాల జిల్లా కోటపల్లిలోని రైతు వేదిక, పారుపల్లిలోని ఎరువుల దుకాణం వద్ద యూరియా కోసం రైతులు గంటల తరబడి నిరీక్షించారు. కోటపల్లిలో 888, పారుపల్లిలో 444 యూరియా బస్తాలు పంపిణీ చేశారు. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కేవలం ఒకే బ్యాగు ఇవ్వడంతో చాలామంది రైతులు నిరాశతో వెనుతిరిగారు. పదేండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు యూరియా కోసం కష్టాలు పడాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో యూరియాకు సరఫరా సాఫీగా సాగిందని గుర్తుచేశారు.
నాటేసి నెలన్నరైంది.. ఒక్క బస్తా రాలే
వరి నాట్లేసి నెలన్నరైంది. ఇప్పటివరకు ఒక్క యూరియా బస్తా రాలే. యూరియా కోసం పొద్దుగాళ్లనే వచ్చిన. ఆఫీస్ ముంగిట లైన్లో నిల్చున్న. ఇయ్యాల యూరియా బస్తాలు ఇస్తమని అధికారులు చెప్పిన్రు. ఇవ్వకుండా ఇంటికి పంపిన్రు. మళ్లీ రమ్మన్నారు.. అప్పుడు కూడా ఇస్తరో.. ఇయ్యరో అర్థమైతలేదు. మమ్ముల్ని ఆగం చేస్తున్రు. ప్రభుత్వం, అధికారులు స్పందించాలే.
-అంజయ్య, అంకుసాపూర్,(సిరిసిల్ల)
రోజంతా నిల్చోబెట్టి రెండు కట్టలిచ్చారు!
యూరియా వస్తున్నదని తెలుసుకొని తెల్లవారుజామునే పీఏసీఎస్ కేంద్రానికి చేరుకున్నాను. రోజంతా క్యూలో నిలబడితే రెండు బస్తాల యారియానే లభించింది. ఇలాగైతే వ్యవసాయం చేయడం చాలా కష్టం.
– శ్రీను, రైతు, క్రాంతినగర్, ఖమ్మం జిల్లా
పొద్దున్నుంచి రాత్రి వరకు క్యూ
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి
ఏం జరిగింది: రాజన్న సిరిసిల్ల జిల్లా అల్మాస్పూర్ సహకార సంఘం పరిధిలోని వీర్నపల్లి, రంగంపేట గ్రామాలకు 225 బస్తాల చొప్పున 450 యూరియా బస్తాలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న రైతులు సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయా గ్రామాల పంచాయతీ కార్యాలయాల వద్ద నిరీక్షించారు. అధికారులు పోలీసుల పహారా మధ్య టోకెన్లు ఇచ్చి, ఒక్కొక్కరికి ఒక్కో బస్తా అందజేశారు. రంగంపేటలో రాత్రి 8గంటల వరకు బస్తాలు పంపిణీ చేశారు. చాలామందికి యూరియా దొరక్కపోవడంతో రైతులు నిరాశ చెందారు.
తెల్లవారుజామున 4గంటలకే
ఖమ్మం జిల్లా తల్లాడ
ఏం జరిగింది: ఖమ్మం జిల్లా తల్లాడ సొసైటీకి యూరియా వచ్చిందని తెలిసి.. రైతులు తెల్లవారుజామున 4 గంటలకే వద్దకు చేరుకుని.. అధికారులు వచ్చేవరకు వేచి ఉన్నారు. ఒక్కో రైతుకు ఒక్కో బస్తాకు మాత్రమే కూపన్లు ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో కంటిమీద
కునుకులేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
నమోదు ఒకచోట.. పంపిణీ మరోచోట
సిరిసిల్ల
ఏం జరిగింది: సిరిసిల్ల సింగిల్‌విండో ఆఫీస్‌కు సోమవారం ఉదయాన్నే 6 గంటలకు రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వ్యవసాయ అధికారుల నుంచి టోకెన్ రాయించుకొని రావాలని సిబ్బంది చెప్పడంతో ఆగమేఘాల మీద చంద్రంపేటకు తరలివెళ్లారు. అక్కడ కూడా చాలాసేపు క్యూలో నిలబడి, టోకెన్లు రాయించుకున్నారు. తర్వాత సింగిల్‌విండో ఆఫీస్‌కు వచ్చిన కొందరు యూరియా తీసుకోగా.. కొందరికి నిరాశే మిగిలింది.
క్యూలోచెప్పులు.. రైతుల తిప్పలు
వనపర్తి జిల్లా ఆత్మకూరు
ఏం జరిగింది: వనపర్తి జిల్లా ఆత్మకూర్ ప్యాక్స్ కార్యాలయానికి యూరియా వచ్చిందని తెలియడంతో పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. ఉదయం 6 గంటల నుంచే జోరుగా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా క్యూలో నిలబడ్డారు. 10 గంటలకు వచ్చిన అధికారులు.. పోలీసులు సాయంతో యూరియా పంపిణీ చేస్తామని చెప్పారు. గంటల తరబడి పడిగాపులు కాచిన రైతులు.. అలసటతో తమకు బదులుగా చెప్పులను క్యూలో ఉంచారు.
యూరియా కోసం… వర్షంలో సైతం
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్
ఏం జరిగింది: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం సోమవారం రైతులతో కిక్కిరిసింది. భూతాయి, ఉమార్డ, పిప్పిరి, దేగామ, టెంబి, మాన్కపూర్, బజార్హత్నూర్, కోల్హారి, భోస్రా, దిగ్నూర్ నుంచి రైతులు తరలివచ్చి వర్షంలోనూ గొడుగులు పట్టుకుని క్యూలో నిలబడ్డారు. రెండు లారీల్లో 888 బ్యాగుల యూరియా రాగా.. రైతులకు ఒక్కొక్కరికి ఐదు బ్యాగుల చొప్పున అందించారు.