Kodanda Reddy | హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): బాటా కంపెనీలో చెప్పులను లైన్‌గా పెట్టినట్టు విత్తన కేంద్రాల ముందు చెప్పులు పెడుతున్నారని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. కృత్రిమంగా చెప్పులు పెట్టి ఫొటోలు తీసి రైతులు పడిగాపులు కాస్తున్నట్టు చిత్రీకరిస్తున్నారని, నిజమైన రైతులెవరూ ఈ విధంగా చేయబోరని అన్నారు. గురువారం గాంధీభవన్‌లో విత్తనాల కొరతపై మాట్లాడుతూ.. విత్తనాల కొరతపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని, రాజకీయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏ కంపెనీ విత్తనాలు అవసరమైతే ఆ కంపెనీ విత్తనాలనే అందించేందుకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
కాంగ్రెస్‌కు రైతులు, వ్యవసాయం విషయంలో అపారమైన అనుభవం ఉన్నదని, అందుకే ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల సంక్షేమం కోసం చకచకా నిర్ణయాలు జరిగాయని వెల్లడించారు. రైతులకు అవసరమైన విత్తనాలను ఆయా జిల్లాల్లో నిల్వ ఉంచి పకడ్బందీగా విత్తనాల సరఫరా చేస్తుంటే బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు సరికాదని అన్నారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ రాజకీయం చేయలేదని, బీఆర్ఎస్ మాత్రం ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. చిహ్నం, గీతం విషయంలోనూ రాజకీయం చేస్తున్నదని దుయ్యబట్టా రు. విత్తనాల పంపిణీలో బీఆర్ఎస్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.