(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, ఛైర్మన్లు, గ్రూప్ ఏ వంటి ప్రభుత్వ ఉన్నత ర్యాంకు పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం తగ్గుతుండటంపై పార్లమెంటరీ ప్యానల్ అసహనం వ్యక్తం చేసింది. పోస్టులకు తగిన అర్హతలు లేవంటూ కుంటిసాకులు చెప్పొద్దంటూ కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సిన 15 శాతం, 7.5 శాతం రిజర్వేషన్లను పోస్టుల భర్తీలో అమలు చేయాలంటూ సూచించింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ కిరీట్ సోలంకీ నేతృత్వంలోని ప్యానెల్ సోమవారం లోక్‌సభలో ఓ నివేదిక ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన ఉన్నతస్థాయి పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)ని ఆదేశించింది. కార్యాచరణకు సంబంధించిన నివేదికను మూడు నెలల్లో సమర్పించాలన్నది. ఈ సందర్భంగా ప్యానెల్ రిపోర్ట్‌లో పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఛైర్మన్ స్థాయి పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారిని ఎందుకు నియమించట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అర్హత కలిగిన అభ్యర్థులు దొరకట్లేదని చెబుతున్నారు. ఇలాంటి కుంటిసాకులను ఇకపై వినదలుచుకోలేదు.
స్సీ, ఎస్టీల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించిన ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
2017లో ఉన్నత పోస్టుల్లో 458 మంది దళితులు ఉంటే 2022నాటికి ఈ సంఖ్య 550కి చేరింది. అంకెల పరంగా చూడటానికి ఇది పెరిగినట్టు కనిపించినా.. నిబంధనల ప్రకారం ఇది చాలా తక్కువ. డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్ పోస్టుల విషయంలోనూ (2017లో 423 మంది, 2022లో 509 మంది) భర్తీ ప్రక్రియ తక్కువగానే ఉన్నది.
జాయింట్ సెక్రటరీ/ఏఎస్/సెక్రటరీ పోస్టుల్లో భర్తీ (2017లో 35 మంది, 2022లో 41 మంది) మరీ తక్కువగా ఉన్నది. 90 మంది అదనపు కార్యదర్శి పోస్టుల్లో 12 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. 242 జాయింట్ సెక్రటరీ పోస్టుల్లో 25 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక, ఎస్సీ, ఎస్టీల కోసం మొత్తం 509 డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్ స్థాయి పోస్టులను మంజూరు చేయగా కేవలం 79 పోస్టులనే భర్తీ చేశారు.
మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పీఎస్‌యూలు, ప్రభుత్వ బ్యాంకులకు చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లలో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిథ్యం దాదాపుగా లేదనే చెప్పాలి. దీంతో దళితులు వివక్షకు గురవుతున్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడంలో భాగం కాలేకపోతున్నారు.
పోటీపరీక్షలు, అభ్యర్థుల ఎంపిక పారదర్శక వాతావరణంలో జరుగాలంటే, అభ్యర్థుల పేర్లను వెల్లడించకుండా ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ల’ను జారీ చేస్తే మంచిది.
సెలక్షన్ ప్రాసెస్ ముగిసేంతవరకూ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కులం వివరాలను ఎక్కడా బహిర్గతం చేయకూడదు. దీంతో పోస్టుల ఎంపికలో ఏమైనా వివక్ష జరిగితే దాన్ని తగ్గించవచ్చు. దీని పర్యవేక్షణకు డీవోపీటీ ఓ ప్రత్యేక రెగ్యులేటరీ అథారీటీని ఏర్పాటు చేయాలి.
బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి డీవోపీటీ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లను నిర్వహించాలి.