హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జైళ్లశాఖలో ఆయనో ఉన్నతాధికారి. కానీ హోదాను మరిచి దుర్భాషలాడుతూ వేధిస్తున్నారని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నోరు తెరిస్తే బండబూతులే మాట్లాడే ఆయనపై చర్యలు తీసుకోవాలని హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదులు చేస్తున్నారు. సదరు అధికారి మాటలు పడలేక కొందరు సెలవులపై వెళ్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. సదరు ఉన్నతాధికారి తన శాఖలో నియంతృత్వపు పాలన సాగిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని జైళ్లశాఖ ఉద్యోగులు చెప్తున్నారు.
ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జైళ్లశాఖలో వాతావరణం దారుణంగా తయారైందని వాపోతున్నారు. సెక్రటేరియట్లో అధికారులు, తన వద్ద పనిచేస్తున్న సిబ్బంది, పర్సనల్ అసిస్టెంట్లను పరుష పదజాలంతో అవమానపరుస్తున్నారని బాధితులు చెప్తున్నారు. ఇటీవల సదరు ప్రబుద్ధుడి వేధింపుల కారణంగా ఇద్దరు అధికారులు ఆత్మహత్యయత్నం చేసినట్టు తెలిసింది. మరో అధికారి తీవ్ర ఒత్తిడితో గుండెపోటుకు గురయ్యాడని, మరో ఇద్దరు అధికారులు అనారోగ్య సమస్యలు ఎదురొంటున్నారని సమాచారం.
అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ఖైదీలపై ఇష్టమొచ్చినట్టుగా అరాచకంగా ప్రవర్తిస్తున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని జైళ్లశాఖలోని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల చర్లపల్లి జైలులో ఓ రిమాండ్ ఖైదీ.. సిబ్బందిపై దాడి చేసినా.. ఆ విషయాన్ని సదరు ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లే సానుకూల వాతావరణంలేదని వాపోతున్నారు. కొందరు అధికారులను మాత్రమే సమీపంగా పెట్టుకుని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారి నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. సీనియర్ అధికారులకు కూడా గౌరవం ఇవ్వకుండా తిట్టడం, అవమానించడం వంటి చర్యలు నిత్యకృత్యం అయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సదరు ఉన్నతాధికారిపై రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ, తక్షణం దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.