హైదరాబాద్, మే10 (నమస్తే తెలంగాణ): జనాభా గణన కోసం ప్రభుత్వమిచ్చిన రిలాక్సేషన్‌ను ఎస్సీ గురుకుల సొసైటీలోని పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు దుర్వినియోగం చేస్తున్నారు. బదిలీలను తప్పించుకునేందుకు డబ్బులు ముట్టజెపుతూ సెన్సస్ డ్యూటీని కొని తెచ్చుకుంటున్నారు. ఉన్నచోటును పదిలం చేసుకుంటున్నారు. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో సెన్సస్ డ్యూటీని అలాట్ చేయించుకున్నవారిపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. ఒకేచోట మూడేండ్ల సర్వీస్ పూరి ్తచేసుకున్నవారికి బదిలీకి అవకాశమివ్వగా, నాలుగేండ్ల సర్వీస్ పూరి ్తచేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని తేల్చి చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి పలు మినహాయింపులు కూడా ఇచ్చింది.
ప్రస్తుతం జనాభా గణన కొనసాగుతున్న నేపథ్యంలో సెన్సస్ డ్యూటీలో ఉన్న ఉద్యోగులను 2027 మార్చి 30 వరకు ఎక్కడికి బదిలీ చేయవద్దని నిర్ణయించింది. ఈ వెసులుబాటును ఎస్సీ గురుకుల సొసైటీలోని పలువురు టీచర్లు, ఉద్యోగులు దుర్వినియోగం చేస్తున్నారు. వాస్తవంగా సొసైటీ మార్గదర్శకాల ప్రకారం నాలుగేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రిన్సిపల్స్, ఐదేండ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లను కచ్చితంగా ఆ గురుకులం నుంచి బదిలీ చేయాల్సి ఉంది. కానీ 2024లో ఈ నిబంధనకు విరుద్ధంగా 8 ఏండ్ల సర్వీస్ వరకు మినహాయింపునిచ్చారు. ప్రస్తుతం గత మార్గదర్శకాల ప్రకారం చేపట్టారు. ఇప్పటికే పలువురు టీచర్లు, ప్రిన్సిపల్స్ సుదీర్ఘకాలంగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా వారు కచ్చితంగా బదిలీ కావాల్సి ఉన్నది. కానీ వారంతా ప్రస్తుతం సెన్సస్ డ్యూటీని సాకుగా చూపుతూ మళ్లీ తమ స్థానాల వద్దనే తిష్ఠ వేసుకుని కూర్చుంటున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధి, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ పట్టణాలు, వాటి సమీప గురుకులాల్లో ఈ పరిస్థితి నెలకొన్నది. ఆ విధంగా సెన్సస్ డ్యూటీలు వేయించుకున్న వారిలో ప్రిన్సిపల్స్ సైతం ఉండడం గమనార్హం. వాస్తవంగా బదిలీ కావాల్సిన స్థానాలన్నీ ప్రస్తుతం వేకెన్సీ జాబితాలో లేకుండా పోయినట్లు తెలుస్తున్నది. దీంతో సిటీ పరిధిలో కొత్తవారికి అవకాశమే లేని పరిస్థితి తలెత్తింది. సొసైటీ ఉన్నతాధికారులు సైతం ఇప్పటివరకు ఎంతమంది టీచర్లు, ఉద్యోగులు సెన్సస్ డ్యూటీలో ఉన్నారనే లెక్కలను తీయకపోవడం గమనార్హం.
ఆ అధికారులను తొలగించండి
సొసైటీలో గతంలో ఇష్టారీతిన బదిలీలు నిర్వహించారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. సొసైటీలోని పలువురు ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడి రాత్రికి రాత్రే జోన్లను మార్చారని ఆరోపిస్తున్నరు. సదరు అధికారుల తీరు వల్ల అనేకమంది నష్టపోయారని, సొసైటీలో స్టాఫ్ ప్యాట్రన్ పూర్తిగా గాడి తప్పిందని వివరిస్తున్నారు. ఒకేచోట ఒకే పాఠ్యాంశానికి సంబంధించి ఇద్దరు, ముగ్గురు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్న దుస్థితి నెలకొన్నదని చెబుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 9 ప్రీమియర్ సీవోఈలు ఉన్నాయి. ఇక్కడ 8వ తరగతి నుంచే విద్యాబోధన కొనసాగుతున్నది. టీజీటీ సిబ్బంది అవసరమే ఉండదు. కానీ ప్రీమియర్ సీవోఈల్లో అనేక మంది టీజీటీలను నియమించారని వివరిస్తున్నారు.
మారుమూల ప్రాంతాల్లో టీజీటీల కొరత తీవ్రంగా ఉందని, పార్ట్‌టైమ్ పద్ధతిలో అక్కడ అదనంగా నియమించాల్సిన దుస్థితి నెలకొన్నదని, అదేవిధంగా డిగ్రీ కాలేజీల్లోనూ స్టాఫ్‌ను రేషనలైజేషన్ చేయలేదని అంటున్నరు. 317 మంది బాధితులకు సంబంధించి, స్పౌస్, డిస్ లొకేట్ సమస్యలు ఎక్కడికక్కడ ఉన్నయని వివరిస్తున్నారు. సొసైటీలో ఈ తప్పిదాలన్నింటికీ హెడ్ ఆఫీస్‌లోని పలువురు ఉన్నతాధికారుల అక్రమాలే కారణమని ఆరోపిస్తున్నారు. గత లోపాలన్నీ తక్షణం సవరించాలని, ఆపై బదిలీలను చేపట్టాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా గతంలో బదిలీ ప్రక్రియలో పాల్గొన్న ఉన్నతాధికారులను ప్రస్తుత బదిలీల్లో జోక్యం చేసుకోకుండా నిలువరించాలని, వారిని ఈ ప్రక్రియకు దూరం పెట్టాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నొక్కి చెబుతున్నాయి.
చక్రం తిప్పుతున్న ఉన్నతాధికారి
బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు విభిన్నంగా సొసైటీ ముందుకుపోవడంలో ఓ ఉన్నతాధికారే కీలకమని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కీలకస్థానంలో ఉన్న సదరు ఉన్నతాధికారి అత్యంత సమీప బంధువు జీహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు ఐదేండ్లకు పైగా విధులను నిర్వర్తిస్తున్నారు. ఆమె కోసమే గత బదిలీల సందర్భంగానూ ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎనిమిదేండ్ల సర్వీస్‌ను బదిలీలకు కటాఫ్‌గా నిర్ణయించినట్టు వివరిస్తున్నారు. ప్రస్తుతం నాలుగేండ్ల నిబంధన రావడంతో బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా బదిలీని తప్పించుకునేందుకు సదరు ఉన్నతాధికారే అక్రమమార్గంలో సెన్సస్ డ్యూటీని సైతం ఇప్పించారని సొసైటీలో విస్తృత ప్రచారం కొనసాగుతున్నది. ఇదిలా ఉంటే ఇప్పుడు సెన్సస్ డ్యూటీ వల్ల సొసైటీలో 3శాతం కంటే ఎక్కువమంది బదిలీలకు అర్హత సాధించడం లేదని, ఈ నేపథ్యంలో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలని చెబుతూ ప్రభుత్వానికే సొసైటీ నుంచి లేఖ రాశారని విశ్వసనీయ సమాచారం. అందులో సదరు ఉన్నతాధికారే కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తున్నది.