సంక్షేమం సన్నగిల్లింది. అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా అటకెక్కిస్తున్నది. కేసీఆర్ పేరును కనుమరుగు చేయాలన్న తహతహలో ప్రజాసంక్షేమాన్ని పరిహాసం చేస్తున్నది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్.. రెండున్నరేండ్లుగా రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న ‘ప్రజాప్రయోజనాల కత్తిరింపు యోజన’కు కొనసాగింపుగానే ఉన్నది. బీసీబంధు, దళితబంధు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, గొర్రెల పంపిణీ, విదేశీ విద్యానిధి పథకాలకు మంగళం పాడింది. రైతుభరోసా, రుణమాఫీ ఇంతకుమించి ఇవ్వలేనని చేతులెత్తేసింది. ఆఖరికి తాను ప్రవేశపెట్టిన పథకాలకూ నీళ్లొదిలింది. ‘పరాభవ’ పద్దులో ఒక్కో స్కీము రెక్కలిరిచింది.
రెండున్నరేండ్లలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా.. ఒక్క కొత్త నిర్మాణం కట్టి చూపించలేదు. రెండున్నరేండ్లలో 3.47 లక్షల కోట్ల అప్పు చేశామని గర్వంగా చెప్పుకుంటున్న సీఎం.. ‘ఇదీ మేం పూర్తిచేసింది!’ అని చెప్పేందుకు ఒక్క ఉదాహరణ లేదు. ఆఖరికి కాళేశ్వరంపై కాలకూట విషం కక్కి.. తెరపైకి తెచ్చిన తమ్మిడిహట్టికీ తట్టెడు మట్టి ఎత్తిందీ లేదు. బడ్జెట్లోనూ దానికి పైసా విదిల్చలేదు. అఖరికి తాను తొడగొడుతున్న మూసీ మొదటిదశకు 1500 కోట్లు మించి కేటాయించలేదు!
సబ్బండ వర్ణాలను సర్కార్ వంచించింది. మూడు నెలల్లో అమలు చేస్తానన్న ఆరు గ్యారెంటీలకు.. మూడో బడ్జెట్లోనూ మొండిచెయ్యే చూపింది. ప్రజల ఆస్తులను కూలగొడుతూ ‘జీరో వ్యాల్యూ’ ట్యాగ్ తగిలిస్తున్న రేవంత్ ప్రభుత్వం.. కేసీఆర్ ప్రణాళికతో పటిష్టంగా నిర్మించిన సంక్షేమ కోటను ఒక్కో ఇటుక తొలగిస్తూ బీటలు వారుస్తున్నది. ‘ఎగ్గొట్టు- కూలగొట్టు-చెడగొట్టు’ ఇదే పాలసీ!
2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్నుల రాబడి రూ.1,11,798 కోట్లు వచ్చినట్టు నిరుటి బడ్జెట్లో పేర్కొన్న ప్రభుత్వం.. 2024-25 సంవత్సరానికి రూ.1,09,233 కోట్లు వచ్చినట్టు తాజా బడ్జెట్లో ప్రకటించింది. అంటే ఏడాదిలో రాష్ట్ర ఆదాయం పడిపోయిందని చెప్తున్నది! అది 2 శాతం నెగెటివ్ గ్రోత్! పదేండ్లలో 16 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్)తో దేశంలోనే తెలంగాణను టాప్స్టేట్గా నిలబెట్టిండు కేసీఆర్. అటువంటి రాష్ర్టాన్ని మైనస్‌లోకి నెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం! తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ‘తొక్కుకుంటూ రావడం’ అంటే ఇదే!
– ఓ నెటిజెన్ వ్యాఖ్య (@anarchist_vs)

హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ‘బడ్జెట్ అంటే కేవలం సంఖ్యలు, అక్షరాలు మాత్రమే కాదు.. మన జీవితం, మన భవిష్యత్తు. నేను ప్రతిపాదిస్తున్న ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశాదీపం’.. రూ.3,24,234 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలివి! కానీ వాస్తవంలో మాత్రం బడ్జెట్లో అంకెల గారడీ తప్ప ఏమీ లేదన్నది ఆర్థిక నిపుణుల మాట. ఓవైపు రాష్ట్ర ఆదాయం పెరిగిందని, మరోవైపు అప్పుల భారం తగ్గిందని, రూ.వేల కోట్లు ఖజానాకు మిగులుతున్నాయని భట్టి విక్రమార్క చెప్తుంటే, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అడ్డగోలు హామీలను నమ్మి మోసపోయిన ప్రతి ఒక్కరూ మళ్లీ ఆశ పెంచుకున్నారు. కానీ ఊరించి, ఉసూరుమనిపించినట్టు కనీసం ఆరు గ్యారెంటీలను పూర్తి చేయడానికి కూడా చేతులు రాలేదు. తులం బంగారం, మహాలక్ష్మీ కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇలా ఆరు గ్యారెంటీలకే దిక్కు లేని పరిస్థితి. పైగా తాజా బడ్జెట్లో ఆరు గ్యారెంటీలకు రూ.5,370 కోట్లు కోత పెట్టడం గమనార్హం. ప్రతి కుటుంబానికీ జీవిత బీమా అంటూ కొత్త పథకాన్ని ప్రకటించినా, దాని అమలుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 6 గ్యారెంటీలకు ఈసారి బడ్జెట్లో భారీ నిధులు కేటాయిస్తారని అందరూ ఆశించారు. ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం, మహాలక్ష్మీ పథకంలో భాగమైన మహిళకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సహాయం, వృద్ధులకు రూ.4 వేల పింఛన్ తదితర పథకాలు అమలు చేస్తారని తెలంగాణ ప్రజలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆశించారు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉన్న నిధుల్లోనే కోత పెట్టి తమ చెవుల్లో పూలు పెట్టిందని నిరాశ చెందుతున్నారు. 2025-26 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలకు రూ.56,083 కోట్లు కేటాయించింది. తాజా బడ్జెట్లో మాత్రం రూ 50,713 కోట్లకే పరిమితం చేసింది.
అంటే రూ.5,370 కోట్లు కోత పెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ‘ఇప్పుడే అధికారంలోకి వచ్చాం..ఆర్థిక పరిస్థితి బాగాలేదు’ అని చెప్పి తప్పించుకున్నది. 2024-25 తొలి బడ్జెట్లో ఇదే పథకాలకు రూ.49,315 కోట్లు కేటాయింపులు చేసింది. రూ.24,948 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2025-26 బడ్జెట్లో రూ.35 వేల కోట్లు ఖర్చు చేసినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఆరు గ్యారెంటీల్లో భాగమైన ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచుతున్నామని ప్రకటించిన ప్రభుత్వం, బడ్జెట్లో ఆ మేరకు నిధులు మాత్రం పెంచలేదు. ఈ ఏడాది కూడా రూ.1,143 కోట్లు కేటాయించారు. కానీ నెట్వర్క్ హాస్పిటళ్లలో పేరుకుపోయిన బకాయిలు రూ.1,205 కోట్లు ఉండటం గమనార్హం.
మహాలక్ష్మి పథకం కింద 18 నుంచి 60 ఏండ్ల లోపు అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపు మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేసి తీరుతామని ఎన్నికల హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 1.68 కోట్ల మంది మహిళలున్నారు. ప్రతి మహిళకూ రూ.2,500 చొప్పున ప్రతినెలా రూ.4,200 కోట్లు చెల్లించాలి. కానీ రెండేండ్లుగా మహాలక్ష్మీ పథకానికి కేటాయింపులు చేయలేదు.
తాజా బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి పథకం అమలు చేస్తారని ఆడబిడ్డలు ఆశించగా నిరాశే ఎదురైంది. ఈ లెక్కన మహాలక్ష్మీ పథకాన్ని ప్రభుత్వం పకకు పెట్టేసిందని, ఈ హామీకి దాదాపు మంగళం పాడినట్టేనని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇక యువతులకు స్కూటీల పథకంపై ప్రభుత్వం పూటకోమాట మాట్లాడుతున్నది. యువతులకు ఈ-స్కూటీలు ఇస్తామని రేవంత్‌రెడ్డి తాజాగా ప్రకటించారు. మంత్రులు సైతం ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో అంతా ఆశపడగా, బడ్జెట్లో మాత్రం రూపాయి కూడా కేటాయించలేదు.
అనేక పథకాలకు సంబంధించి ప్రభుత్వం కేటాయింపులు పెంచలేదు. దీంతో నిరుడు కేటాయించిన నంబర్లనే తిరిగి వాడుకున్నది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు సంబంధించి ఈ ఏడాది కొత్త వారికి అవకాశం లేదు. గతేడాది కేటాయింపులు రూ.2,080 కోట్లను యథావిధిగా దించింది. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల కుటుంబాలు లబ్ధిదారులుగా ఉండగా, ప్రభుత్వం 48 లక్షల కుటుంబాలకే గృహజ్యోతి పథకాన్ని వర్తింపచేస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. మహాలక్ష్మీ పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నట్టు సర్కార్ చెప్తున్నది. ఈ పథకానికి నిరుడు బడ్జెట్లో రూ.723 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లోనూ అంతే మొత్తం కేటాయించింది.
రైతుభరోసా దశలవారీగా పెంచుతారని, ఎన్నికల హామీ మేరకు ఎకరాకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తారని రైతులు ఆశించారు. కానీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లే కేటాయించింది. గత బడ్జెట్లోనూ ఇంతే నిధులు కేటాయించింది. అంటే.. ఇక రైతు భరోసా నిధులు పెంచేది లేదని ప్రభుత్వం తేల్చేసింది. కేటాయించిన నిధులు సైతం విడుదల చేస్తుందనే నమ్మకం లేదని రైతులు పేర్కొంటున్నారు. 2025-26లో యాసంగికి మాత్రమే భరోసా ఇచ్చి, వానకాలానికి కోత పెట్టిన సంగతి గుర్తు చేస్తున్నారు. చేయూత పథకానికి గత బడ్జెట్లో మాదిరిగానే రూ.14,861 కోట్లు కేటాయించింది. వాస్తవానికి ఈ ఏడాది రెండు లక్షల మందికి అదనంగా పింఛన్లు ఇస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. కానీ ఆ మేరకు నిధులు పెంచలేదు.
ప్రతి నియోజకవర్గానికీ 3,500 చొప్పున 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రకటించింది. రూ.22,500 కోట్లు అవసరమని అంచనా వేసింది. మూడేండ్లు అవుతున్నా నిర్మాణాలు ఇంకా సా..గుతూనే ఉన్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం మూడేండ్లకు కలిపి రూ.67,500 కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది కేటాయించిన నిధులు కేవలం రూ.5,500 కోట్లు మాత్రమే. గత బడ్జెట్లో రూ.12,571 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.7,071 కోట్లు కోత పెట్టింది. విచిత్రం ఏమిటంటే మూడు బడ్జెట్లల్లో కలిపి ఇందిరమ్మ ఇండ్ల కోసం ఖర్చు చేసింది రూ.300 కోట్లు కూడా దాటవని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇక ఈ పథకంలో భాగమైన ఇంటిస్థలం లేని వారికి స్థలం కేటాయింపు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం హామీలకు సైతం అతీగతీ లేదు.
కేసీఆర్ ప్రభుత్వం నుంచి చక్కగా సాగుతున్న 1,023 గురుకుల పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను తెరమీదికి తెచ్చింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రెండేండ్లు దాటి నా అరకొర నిధులతో ఒక్క పాఠశాల నిర్మాణం కూడా పూర్తికావడం లేదు. ప్రతి స్కూల్‌కూ రూ.200 కోట్లు ఖర్చు చేసి 109 స్కూళ్లు కట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. గత బడ్జెట్లో రూ.2,900 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రూ.200 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. తాజా బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడీ తప్ప, దశాదిశ లేదని ఆర్థిక ని పుణులు పేర్కొంటున్నారు.
వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సిన ప్రభుత్వం నిధుల్లో కోత పెట్టింది. 2025-26 బడ్జెట్లో రూ.24,439 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఈ ఏడాది రూ.1,260 కోట్లు కోత పెట్టింది. రూ.23,179 కోట్లకు కుదించింది. రైతు పండించిన ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామంటూ ఎన్నికల్లో ప్రకటించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక కేవలం సన్నాలకే ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కింది. వాటికైనా పూర్తిస్థాయి నిధులు కేటాయించిందా? అంటే అదీ లేదు. రాష్ట్రంలో రెండు సీజన్లలో కలిపి కోటి టన్నుల సన్నాలు ఉత్పత్తి అయినట్టు ప్రభుత్వమే
చెప్తున్నది.
రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా కల్పిస్తామని ప్రభుత్వం ఇందిరమ్మ పేరుతో బీమా పథకాన్ని ప్రకటించింది. కానీ ఈ పథకం అమలుపై స్పష్టత లేదు. కేసీఆర్ హయాం నుంచీ రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం రైతుబీమా చెల్లిస్తున్నది. చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఇతర వర్గాలకు ప్రత్యేకంగా బీమా పథకాలు అమలు చేస్తున్నది. మరి కొత్త పథకం అమలు చేస్తే ఈ బీమా పథకాలను ఉంచుతారా? తీసేస్తారా? అనేది స్పష్టత లేదు.
కేసీఆర్ పథకాలకు మసిపూసి కొత్త పథకాలు అన్నట్టుగా చూపించడం. ఆల్రెడీ అమలవుతున్న పథకాలకు పేర్లు మార్చడం! రైతుబీమా, చేనేత బీమా పథకాలను పేరు మార్చి ఇందిరమ్మ బీమాకింద చూపించడం! కేసీఆర్ హయాంలో ప్రారంభమైన ఓవర్సీస్ పథకం టామ్‌కామ్ పేరు మార్పు! ఇక బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని మధ్యలో ఆపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తామేదో కొత్తగా ప్రారంభిస్తున్నట్టు బిల్డప్! ఆఖరికి కేసీఆర్ తెచ్చిన వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులనూ తనఖాతాలో వేసుకొన్నది.
ఎన్నికల ముందు ఊదరగొట్టిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి రాగానే పాతరపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. తన పాలనలో తానిచ్చిన హామీలకే దిక్కులేదని తాజా బడ్జెట్‌తో మరోసారి చాటుకున్నది. జాబ్ క్యాలెండర్ ఊసే లేకుండా చేసి, నిరుద్యోగులకు మరోసారి ధోకా ఇచ్చింది. పెన్షన్ల పెంపు లేదు. రైతుభరోసా పెంచలేదు. కౌలురైతులను పట్టించుకున్నదీ లేదు. మహిళలకు 2,500 లేనేలేదు.. పెండ్లికి తులం బంగారం అసలే లేదు.
కొత్త పథకాలు ఇవ్వకపోగా, ఉన్న కేసీఆర్ పథకాలకూ కోతపెట్టింది రేవంత్ సర్కార్. బడ్జెట్లో వాటికి నిధులు ఇవ్వలేదు. రైతు బీమా, చేనేత బీమా ప్రస్తావనేలేదు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి 70 శాతం నిధులు తగ్గించింది. రైతు పథకాలకూ నిధులివ్వలేదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నా.. విద్యారంగానికి బడ్జెట్లో భారీగా కోత పెట్టింది. సాగునీటి రంగానిదీ అదే పరిస్థితి. గొర్రెల పంపకం పథకాన్ని గాలికొదిలేసింది.
కేసీఆర్ పథకాలపై కడుపుమంటో, తామిచ్చిన హామీలనూ అమలు చేయలేని అశక్తతో వేరు. కానీ, నిరుడు తాము ప్రారంభించినపథకాలకూ నిధులివ్వలేక నిలిపివేయడం మరో నవ్వులపాలయ్యే విషయం. రాజీవ్ యువ వికాసాన్ని నిరుడు ప్రారంభించి, దరఖాస్తులు కూడా తీసుకున్న ప్రభుత్వం.. ఇంతవరకు గ్రౌండింగ్ కాలేదు. ఈసారి బడ్జెట్లో పాత నిధులకు కోతపెట్టారు. ఆ పథకాన్ని అమలు జరిపే ఉద్దేశం తమకు లేదని
చెప్పకనే చెప్పింది కాంగ్రెస్ సర్కార్.