హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ అసమర్థత, వ్యవసాయంపై ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వక్తలు విమర్శించారు. ఎరువుల కోసం రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఫోరం సీనియర్ జర్నలిస్టు రమణకుమార్ అధ్యక్షతన ‘రాష్ట్రంలో యూరియా కొరత- రైతుల సమస్యలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రేవంత్ సరార్ వైఫల్యం వల్లే రైతులు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. వ్యవసాయంపై ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఎరువుల కొరత ఏర్పడిందని చెప్పారు.
నిరుడితో పోల్చితే ఈ సంవత్సరంలో రాష్ట్రంలో 22 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గినా యూరియా కొరత రావడంలో అర్థంలేదని చెప్పారు. కేంద్రం ఇప్పటికే వానాకాలం సీజన్‌కు సంబంధించిన కోటాను మొత్తం సరఫరా చేశామని చెప్తుంటే… రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే వచ్చాయని చెప్తున్నదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించుకోవడంలో విఫలమైందని తెలిపారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి.. రైతుల కోసం పనిచేయాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయడంలో ముందస్తు ప్రణాళిక రూపొందించకుండా రాష్ట్రం తప్పుచేసిందని టెసాబ్ మాజీ చైర్మన్ రవీందర్రావు విమర్శించారు. పదేండ్లలో రైతులు ఎరువుల కోసం రోడ్లపై నిలబడడం తాను ఎప్పుడూ చూడలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ సమైక్యాంధ్రలోని పరిస్థితి తెలంగాణ రైతులకు వచ్చిందని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులు ఎరువుల సరఫరా, నిల్వలపై ప్రతిరోజూ మానిటరింగ్ చేసే వారని, అందుకే ఎరువుల కొరత రాలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని చెప్పారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి తెలిపారు. రేవంత్ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే రైతులు యూరియా కోసం రోడ్లపై క్యూలో నిలబడాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం, రైతు సమస్యలపై కనీస అవగాహన లేదని రైతు బోర్ల రాంరెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా.. ఏ రోజు కూడా వ్యవసాయం గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు రోడ్లపైకి రావడం దురదృష్టకరమని రైతు నాయకుడు పాండురంగారావు అన్నారు. రైతులకు ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని చెప్పారు. ఎరువుల యూరియా కొరత పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆర్థికవేత్త డాక్టర్ పాపారావు అన్నారు. ముందస్తు వ్యవసాయ ప్రణాళిక లేకపోవడం వల్లే యూరియాకు డిమాండ్ పెరిగింది. సకాలంలో రసాయనిక ఎరువులు వాడకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రయాదం ఉంది. విత్తనం దగ్గర నుంచి పంట విక్రయం వరకు రైతులు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బస్తాల పంపిణీలో కోత ఎందుకు?
సొసైటీలో ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియా మాత్రమే పంపిణీ చేస్తున్నారు. నేను 10 ఎకరాల వరి పంట సాగు చేస్తున్నాను. కనీసం 15 బస్తాల యూరియా అవసరం ఉంది. కానీ 2 బస్తాలు ఇస్తే ఏ మూలకు సరిపోతాయి? ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. యూరియా పంపిణీలో కోత ఎందుకు పెడుతున్నది. ప్రతి రైతుకూ అవసరమైన యూరియాను వెంటనే అందుబాటులో ఉంచాలి.
-కృష్ణ, రైతు, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
గింత తిప్పలు ఎప్పుడూ పడలేదు
ఇరవై ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్న. నాటు వేశాక యూరియా కోసం గింత తిప్పలు ఎప్పుడూ పడలేదు. పరిస్థితి ఘోరంగా ఉంది. పొలం వేసి నెల కావొస్తున్నది. యూరియా ఎప్పుడో చల్లాల్సి ఉండె. కానీ కొంత పొలానికే చల్లినం. రోజూ తెలిసిన వారికి ఫోన్ చేసి.. యూరియా ఉందా..! అని అడగాల్సి వస్తున్నది. యూరియా కష్టాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలె.
-శ్రీనివాస్, రంగపేట, కరీంనగర్ జిల్లా
ఇప్పుడు చల్లకపోతే దిగుబడి పోతది
ఇప్పుడే పొలం పచ్చబడుతున్నది. ఇంకో వారానికి యూరియా చల్లినా ప్రయోజనం ఉండదు. సమయం అయిపోయినంక ఎంత చల్లినా వేస్టే. ఇసోంటి కష్టం పదేండ్లలో ఎన్నడూ చూడలేదు. నేను ఎవుసం మొదలు పెట్టినప్పుడు గిట్లనే కష్టం ఉండె. ఇప్పుడు మళ్లీ తిప్పలైతంది.
-కొమురయ్య, రంగపేట, కరీంనగర్ జిల్లా
యూరియా సక్రమంగా రావట్లేదు
రైతులకు అవసరమైన యూరియా సక్రమంగా రావడం లేదు. వచ్చిన కొద్ది పాటి యూరియా కొంత మందికే అందుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాసినా యూరియా అందడం లేదు. వర్షాలు కురిసినప్పుడే పంటలకు బలం కావాలంటే యూరియా తప్పనిసరిగా అవసరం. యూరియా కోసం ఇంకా ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఏమో… గతంలో యూరియా కొరత ఉండేదికాదు.
– లక్ష్మయ్య, అనంతగిరిపల్లి, వికారాబాద్