పెద్దపల్లి రూరల్, జనవరి 16: పెద్దపల్లి జిల్లా భోజన్నపేటలో చెక్‌డ్యామ్ పేల్చివేతకు కుట్ర జరిగింది. హుస్సేన్‌మియా వాగుపై నిర్మితమైన ఈ చెక్‌డ్యామ్‌ను జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చివేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. అందులో భాగంగా సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బండ్‌కు కంప్రెషర్ మిషన్‌తో హోల్స్ వేస్తున్న వారిని సమీపంలోని రైతులు గమనించడంతో పేలుడు సామాగ్రిని అక్కడే వదిలేసి ట్రాక్టర్‌తో పరారయ్యారు.
ఇప్పటివరకు రాష్ట్రంలోని చెరువులకు ఎంతో అండగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రభుత్వం మరమ్మతుల పేరిట నీటిని తోడేయడం, భూగర్భ జలాలు అడుగంటి యాసంగి పంటలకు సాగునీరు అందకపోవడంతో ఈ చెక్‌డ్యామ్ నుంచి నీటిని మళ్లించుకునేందుకు దిగువ ప్రాం తంలోని భూముల రైతులే ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. దీనిపై ఎస్సారెస్పీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పెద్దపల్లి సీఐ అనిల్‌కుమార్, ఎస్ఐ మల్లేశం చెక్‌డ్యామ్ వద్దకు వెళ్లారు.
దుండగులు వదిలేసిన 11 జిలెటిన్ స్టిక్స్, కంప్రెషర్ మిషన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, వారు ఎంతటివారైనా కఠిన చర్యలు చేపడతామని సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. హుస్సేన్‌మియా వాగులో వృథాగా పోతున్న నీటిని కొత్తపల్లి, భోజన్నపేట, మూలసాల, చీకురాయి గ్రామాల సాగునీటి అవసరాలకు వినియోగించేందుకు 2018లో రాష్ట్ర ప్రభుత్వం భోజన్నపేట- మూలసాల మధ్య రూ.4.19 కోట్ల వ్యయంతో ఈ చెక్‌డ్యామ్‌ను నిర్మించింది.
కఠిన చర్యలు తీసుకోవాలి
మా ఊరి పక్కనే హుస్సేన్‌మియా వాగు ఉన్నప్పటికీ గతంలో చుక్కనీరు వాడుకోలేని పరిస్థితి. మా బాధను గుర్తించి ఐదేండ్ల క్రితం కేసీఆర్ ప్రభుత్వం చెక్‌డ్యామ్‌ను నిర్మించింది. అప్పటి నుంచి సాగునీటికి ఢోకా లేదు. సోమవారం ఈ చెక్‌డ్యామ్‌ను పేల్చివేసేందుకు ప్రయత్నించిన దుండగులు మమ్మల్ని చూసి పరారైన్రు. వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలి.
– మేకల శ్రీనివాస్, రైతు, చీకురాయి