హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): నదీజలాల విషయమై ఎగువ రాష్ర్టాలతో ముందస్తుగా సమన్వయం చేసుకోవాలని, ప్రొరేటా ప్రకారం దిగువ ప్రాజెక్టులకు నీళ్లు వచ్చేలా చూడాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావముంటుందనే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా దకేలా చూడాలని ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలు డ్యామ్లు నిండిన తర్వాతే నీళ్లు వదిలే విధానాన్ని పాటిస్తే మనకు ఇబ్బందులు ఎదురవుతాయని, ఈ నేపథ్యంలో ప్రొరేటా ప్రకారం వాటా జలాలు వచ్చేలా ఆయా రాష్ట్రాల అధికారులతో ముందుగానే చర్చించి తగు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.