Musi Riverfront | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): మూసీ పునర్జీవ ప్రాజెక్టుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. అభివృద్ధి పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చడంపై బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రతిపక్షాలు భగ్గమనగా, కాంగ్రెస్‌లోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నది జన్మస్థానం నుంచి రాజధాని దాటేదాకా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ప్రజా ఉద్యమాలు, కోర్టుల్లో కేసులు వంటివాటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఎలాగైనా తమ కలల ప్రాజెక్టును సాకారం చేసుకునేందుకు కొత్త ఆలోచన అమలు చేస్తున్నారు. ప్రాజెక్టు వద్దంటూ ఎగువన వినిపిస్తున్న డిమాండ్‌కు పోటీగా దిగువన నల్లగొండ వైపు నుంచి ప్రాజెక్టుకు మద్దతు కూడగట్టాలని నిర్ణయించింది. ప్రక్షాళన చేయాలంటూ ప్రజలే డిమాండ్ చేస్తున్నట్టు సీన్ సృష్టించాలని భావిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే అవగాహన యాత్రలు, చైతన్య యాత్రల పేరుతో కార్యక్రమాలు మొదలుపెట్టింది. అయితే ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. దీంతో ఉమ్మడి నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు ప్రజల్లోకి వెళ్లాలని, విరివిగా సభలు, సమావేశాలు నిర్వహించాలని పార్టీ పెద్దలు ఆదేశించారట. ఈ నేపథ్యంలో వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు.
రమ్మంటే రాలేదు..
మూసీ ప్రాజెక్టుకు మద్దతుగా ఇటీవల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్టుకు మద్దతు కూడగట్టేందుకు ఈ సమావేశాన్ని వాడుకోవాలని భావించారు. గ్రామాల నుంచి రైతులను తీసుకురావాలని, జనసమీకరణ చేయాలని అనుకున్నారు. కానీ కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయ్యింది. రైతులు, ప్రజల నుంచి స్పందన రాలేదు. దీంతో కాంగ్రెస్ పెద్దలు ఆలోచనలో పడ్డారట. ‘ప్రజలు మనం పిలిస్తే రావడం లేదు.. కాబట్టి మనమే వెళ్లి వాళ్ల మధ్య తిరగాలి’ అని నిర్ణయించుకున్నారని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాదయాత్రలు, అవగాహన సదస్సుల పేరుతో మూసీ ప్రాజెక్టుకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండుమూడు రోజుల్లో కనీసం 10వేల మందితో సభలు నిర్వహించాలని పార్టీ పెద్దలు ఆదేశించినట్టు తెలుస్తున్నది. చివరగా.. మరో వారం రోజుల్లో నల్లగొండలో లక్ష మందితో సభ నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారని సమాచారం. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్తున్నారు. ఎగువన ప్రజల పోరాటాన్ని నది దిగువన ఉన్న ప్రజల పోరాటంతో అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.