Congress-CPM | హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కాంగ్రెస్-వామపక్షాల పొత్తులపై ఇంకా స్పష్టత రావడం లేదు. తాము అనుకున్న స్థానాన్ని ఇవ్వకుంటే కాంగ్రెస్కు కటీఫ్ చెప్పాలని సీపీఎం నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సీపీఐకి కొత్తగూడెంతోపాటు మరో సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. రెండోసీటుగా మునుగోడుకు బదులు మరో స్థానం కేటాయించే అంశంపై ఇరు పార్టీల మధ్య ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు, సీపీఎం-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం విషయంలో విభేదాలు తలెత్తాయి. ఆ పార్టీకి మిర్యాలగూడతోపాటు మరో స్థానం కేటాయిస్తామని కాంగ్రెస్ చెబుతుండగా, సీపీఎం మాత్రం ఖమ్మం జిల్లాలో తమకు కచ్చితంగా సీటు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నది. భద్రాచలం, మధిర, పాలేరు స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించాలని పట్టుబడుతున్నది. భద్రాచలం, మధిర నియోజకవర్గాలు సిట్టింగ్ స్థానాలు కావడంతో కాంగ్రెస్ ససేమిరా అంటున్నది.
కనీసం పాలేరు అయినా ఇవ్వాలని కోరుతుండగా, ఇటీవల కాంగ్రెస్లో చేరిన పొంగులేటి పాలేరు నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇలా అయితే లాభం లేదని భావించిన సీపీఎం.. భద్రాచలం అభ్యర్థిని మరోచోటికి మార్చి తమకు ఆ స్థానం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇక్కడ ఇప్పటి వరకు 10సార్లు ఎన్నికలు జరిగితే 8సార్లు సీపీఎం గెలిచిందని ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఈ పీటముడి కనుక తెగకుంటే కాంగ్రెస్తో కటీఫ్ చేసుకుని 15 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం పట్టుదలగా ఉన్నట్టు సమాచారం.