HomeTelanganaThere Is Only One Medical College Per 10 Lakh Population
10 లక్షల జనాభాకు ఒక్కటే మెడికల్ కాలేజీ
మెడికల్ కాలేజీల అనుమతులకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నూతన మార్గదర్శకాలను రూపొందించింది. వీటిపై అభిప్రాయాలు తెలుపాల్సిందిగా నిపుణులను కోరింది. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి.
ఒక్కో కాలేజీకి గరిష్ఠంగా 150 సీట్లే
15 కిలోమీటర్లలోపు ఇంకో కాలేజీకి నో
220 పడకల అనుబంధ దవాఖాన చాలు
ఎన్ఎంసీ నూతన మార్గదర్శకాలు
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): మెడికల్ కాలేజీల అనుమతులకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నూతన మార్గదర్శకాలను రూపొందించింది. వీటిపై అభిప్రాయాలు తెలుపాల్సిందిగా నిపుణులను కోరింది. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి.
వచ్చే ఏడాది (2024-25) నుంచి ప్రారంభించే నూతన మెడికల్ కాలేజీలకు గరిష్ఠంగా 150 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే కేటాయిస్తారు. కనిష్ఠంగా 50 సీట్లతో కాలేజీ ప్రారంభించవచ్చు. అర్హతలను బట్టి 50, 100, 150 పద్ధతిలో సీట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం కనిష్ఠంగా 100 సీట్లు, గరిష్ఠంగా 250 సీట్ల వరకు పెంచుకునే అవకాశం ఉండగా 40 శాతం కోత విధించనున్నారు.
2023-24లో విస్తరణకు దరఖాస్తు చేసుకొని, తిరస్కరణకు గురైన కాలేజీలకు మాత్రం గరిష్ఠ పరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది.
ఇకపై ఎంబీబీఎస్ విద్యార్థులు, సిబ్బందికి ఆధార్ ఆధారిత అటెండెన్స్ విధానాన్ని అమలు చేస్తారు. దీంతో నకిలీ అటెండెన్స్‌ను నియంత్రించవచ్చని భావిస్తున్నారు. అందరికీ ఏటా కనీసం 75 శాతం హాజరు ఉండాల్సిందేనని నిబంధన విధించనున్నారు.
ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీకి చుట్టూ 15 కిలోమీటర్ల పరిధిలో కొత్త మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వరు.
ప్రస్తుతం ఒక మెడికల్ కాలేజీ ఒకటే క్యాంపస్‌లో నిర్వహించాలనే నిబంధన ఉన్నది. దీనిని సడలిస్తూ రెండు క్యాంపస్‌లలో నిర్వహించే అవకాశం కల్పించింది. అయితే రెండింటిమధ్య నడక దూరం గరిష్ఠంగా 30 నిమిషాలకు ఉండొద్దని నిబంధన విధించనున్నారు.
ప్రస్తుతం మెడికల్ కాలేజీకి అనుబంధంగా కనీసం 300 పడకల దవాఖాన ఉండాలి. దీనిని 220 పడకలకు తగ్గించనున్నారు.
ప్రతి కాలేజీలో కచ్చితంగా 24 విభాగాలు ఉండాల్సిందే. కొత్తగా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ రిసెర్చ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సిబ్బంది పిల్లల కోసం చైల్డ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి.
కాలేజీలో కచ్చితంగా మూడు మ్యూజియంలు ఉండాలి. ఒకటి అనాటమీకి, మరొకటి పాథాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, మూడోది ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్‌కు కేటాయించాల్సి ఉంటుంది.
వీటితోపాటు కచ్చితంగా ఎన్ని పుస్తకాలు ఉండాలో, ఎన్ని కంప్యూటర్లు ఉండాలో, తరగతి గదులు ఎన్ని ఉండాలో, విభాగాల వారీగా ఎలాంటి సౌకర్యాలు ఉండాలో ప్రాథమిక నివేదికలో పొందుపరిచారు. 30 రోజుల అనంతరం వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా మార్పులు చేసి, కొత్త నిబంధనలను అమల్లోకి తేనున్నారు.