నల్లగొండ, డిసెంబర్ 1: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీసీ అభ్యర్థి యాదగిరి యాదవ్‌ను కిడ్నాప్ చేసి మద్యంలో మూత్రం కలిపి తాగించిన కాంగ్రెస్ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బాధితులు యాదగిరి-నాగలక్ష్మి దంపతులతో కలసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోసంచేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ బిడ్డలను కిడ్నాప్ చేయడాన్ని బీసీ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు.
ఎన్నికల సంఘం వెంటనే ఈ ఘటనపై స్పందించి బాధ్యులను 24 గంటల్లో అరెస్టు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అగ్రవర్ణాల వారు బీసీలపై దాడులు చేస్తే తాము ప్రతిదాడులు చేస్తామని స్పష్టంచేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. యాదగిరిని కిడ్నాప్ చేసిన బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఎల్లమ్మ గూడెం మాజీ సర్పంచ్ విజయ్‌రెడ్డి హత్య కేసులో నిందితులు ఏ-1 సందీప్‌రెడ్డితో పాటు ఏ-2 ప్రవీణ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, పాశం రాంరెడ్డి తదితరులు యాదగిరిని కిడ్నాప్‌చేసి, హైదరాబాద్‌కు తీసుకెళ్లి మద్యంలో మూత్రం పోసి తాగించారని తెలిపారు. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యల్లేవని మండిపడ్డారు. ఎన్నికల అధికారిగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. 24 గంటల్లో ఆ నలుగురిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో పాటు హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
నామినేషన్ వేసేందుకు అద్దెకు కారు మాట్లాడేందుకు నకిరేకల్‌లోని ఇంటి నుంచి బయటకు వెళ్లగానే కొందరు తనను కుక్కను ఈడ్చినట్టు ఈడ్చుకెళ్లి కారులో పడేసి, హైదరాబాద్ తీసుకెళ్లినట్టు బాధితుడు యాదగిరి తెలిపారు. రోజంతా కారులో తిప్పి, హైదరాబాద్‌లోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి నామినేషన్ వేయవద్దని బలవంతం చేశారని వాపోయారు. వినకపోవడంతో మద్యంలో మూత్రం పోసి తాగించడంతో పాటు పిడిగుద్దులు గుద్దారని, దుస్తులు మొత్తం విప్పేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే వారిపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని యాదగిరి-నాగలక్ష్మి దంపతులు కోరారు.