హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకే మేము ఫార్ములా ఈ-రేస్ నిర్వహించినం. ఇందుకోసం 55 కోట్లు చెల్లించినం. ఈ మొత్తం ముట్టినట్టు ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్సీఐ) వెల్లడించింది. ఇందులో అవివీతి ఎక్కడిది? అవినీతే లేనప్పుడు ఏసీబీ ఎందుకు?
-కేటీఆర్
KTR | హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఫార్ములా-ఈ రేస్ విషయంలో తాను ఎలాంటి తప్పూ చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం తనపై అక్రమంగా కేసు నమోదు చేసినా భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. తాము తెలంగాణ ఉద్యమకారులమని, ఉద్యమ నాయకుడి బిడ్డలమని, ఇలాంటి అక్రమ కేసులకు అణచివేతలకు, కుట్రలకు భయపడకుండా కొట్లాడుతూనే ఉంటామని పునరుద్ఘాటించారు. ‘ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి న్యాయంగా కొట్లాడుతా’ అని తేల్చిచెప్పారు.
ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం చేస్తున్న అవినీతిని, అక్రమాలను ఒకొకటిగా బయటపెడుతున్నందునే తమపై రేవంత్‌రెడ్డి సర్కారు రాజకీయ వేధింపులకు దిగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని, ఈ అంశంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ కార్యాచరణ చేపడుతుందని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే ఈ రేస్ నిర్వహించామని, ఇందుకు రూ. 55 కోట్లు చెల్లించామని, ఈ మొత్తం ముట్టినట్టు ఫెడరేషన్ ఆఫ్ మోటర్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్సీఐ) వెల్లడించిందని తెలిపారు. ఇందులో అవివీతి ఎక్కడిది? ఏసీబీ ఎందుకు? అని నిలదీశారు.
రేవంత్‌రెడ్డి సర్కారు 3వ ఇన్స్టాల్మెంట్ చెల్లించక పోవడం వల్లే ఫార్ములా ఈ-రేస్ రద్దయ్యిందని స్పష్టంచేశారు. అంతర్జాతీయ ఫార్ములా ఈ నిర్వాహక సంస్థ ఎఫ్ఐఈకి భారతదేశ విభాగం చెల్లించిన రూ.73 లక్షల రేసు ఫీజులను కూడా తిరిగి పంపించిందని చెప్పారు. దాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఈ రేస్‌పై చర్చించేందుకు రేవంత్‌రెడ్డి ఎందుకు భయపడుతున్నారని, నాలుగు గోడల మధ్య అనుకూల మీడియాకు ఎందుకు లీకులు ఇస్తున్నారని నిలదీశారు. ఈ-రేస్ వ్యవహారంలో ఏసీబీ తనపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో గురువారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం తమపై, తమ పార్టీపై చేస్తున్న కుట్రలను ఎండగడతామని కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెచ్చగొట్టాలని చూసినా ప్రజాస్వామ్యయుతంగా న్యాయపరమైన మార్గాల్లో వెళ్తామని, ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబెడుతామని చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్నిరకాల అటెన్షన్ డైవర్షన్ పనులు చేసినా ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ‘ఈ రోజు నేను చెప్పిన ప్రతిమాటకు, చూపించిన ప్రతి డాక్యుమెంట్‌కు కట్టుబడి ఉన్నా. కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మొత్తం వ్యవహారంలో భంగపాటు తప్పదు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కేటీఆర్ కోరారు. ‘రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, కుట్రలను ప్రజల ముందు ఉంచాను. ప్రజలు నిజానిజాలు గుర్తించి ప్రభుత్వ కుట్రలను తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి దివాలాకోరుతనం వల్లే ఈ కేసు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ అంశంలో అవినీతి జరిగిందని భావిస్తే అందుకు తగిన సాక్ష్యాలు ఉంటే ప్రస్తుత అసెంబ్లీలోనే చర్చ పెట్టాలని సవాల్ చేస్తున్న. కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆధారాల్లేవు. కేవలం రాజకీయపరమైన దురుద్దేశంతోనే కేసు నమోదు చేయించింది. నిజంగానే ప్రభుత్వంలో తెలివైన మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని ఉంటే అసెంబ్లీసాక్షిగా రాష్ట్ర ప్రజల దృష్టికి ఇందులో జరిగిన అవినీతిని చెప్పాలి. అసెంబ్లీలో మాట్లాడలేని దద్దమ్మ మంత్రులు, ముఖ్యమంత్రి కేవలం లీకులతో దుష్ప్రచారం చేస్తున్నారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
తొలి దఫా రేసు తర్వాత ప్రైవేట్ స్పాన్సర్‌కు ఆర్థికపరమైన నష్టం రావడంతో రెండో రేసులో తాము పాల్గొనలేనట్టు తెలిపారని కేటీఆర్ గుర్తుచేశారు. ‘రేనును కొనసాగించాలా? లేక ఆపేయాలా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని ఫార్ములా ఈ- రేస్ నిర్వాహక సంస్థ అడిగింది. ప్రపంచ నగరాలతో పోటీపడి భారతదేశానికి రేసు తీసుకొచ్చి హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించాం. అనంతరం జరి గిన ఆర్థిక ప్రయోజనం, రేసు సందర్భంగా నిర్వహించిన ఈ మొబిలిటీ వీక్‌లో వందల కోట్ల రూపాయల ఎలక్ట్రిక్ వాహన రంగ పెట్టుబడులు వచ్చాయి.
ఈ నేపథ్యంలో మూడేండ్లపాటు ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు హైదరాబాద్ నగరాభివృద్ధి, ప్రాచుర్యం కోసం నిబంధనల మేరకు రేసుని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రేసులను నిర్వహించాలని ప్రభుత్వం తరఫున నిర్ణయించినం. హెచ్ఎండీఏ వైస్ చైర్మన్ హోదాలో నేను, ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి నిర్ణయం తీసుకొని నిబంధనల మేరకు ఫైల్ సర్క్యులేట్ చేసి ఫార్ములా ఈ నిర్వహణ సంస్థకు డబ్బులు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నం. అందు లో భాగంగానే సుమారు రూ.55 కోట్లను రెం డు విడతల్లో చెల్లించినం. తదుపరి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉన్నదని ఫార్ములా ఈ సంస్థ డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది’ అని కేటీఆర్ వివరించారు.
‘ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ (ఎఫ్ఐఏ) సంస్థ ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు ఆల్బర్టో లాంగోతో డిసెంబర్ 13న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అప్పటి పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ సమావేశయ్యారు. సమావేశం అత్యంత సానుకూలంగా జరిగిందని నూతన ప్రభుత్వం కూడా ఈ రేసులను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి డిసెంబర్ 19న లేఖ కూడా రాసింది. సమావేశం అనంతరం మరోసారి ఫార్ములా ఈ సంస్థ రానున్న రేసు నిర్వహణ కోసం ప్రభుత్వం చెల్లించాల్సిన కాంట్రాక్టు నిబంధనలను, ఫీజుల గురించి ప్రస్తావించింది.
డిసెంబర్ 21 నాటికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని చెప్పాలని, లేకుంటే రేసును నిర్వహించే పరిస్థితి తమకు ఉండదని స్పష్టంచేసింది. అనంతరం డిసెంబర్ 22న దానకిశోర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి ఎఫ్ఐఏ సంస్థ లీగల్ డైరెక్టర్ లేఖ రాశారు. మరో నాలుగు రోజులపాటు అంటే డిసెంబర్ 26 నాటికి గడువు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించకపోవడంతో హైదరాబాద్ నగరంలో రేసులు నిర్వహించలేమని సంస్థ స్పష్టంగా తెలియజేసింది. అంతర్జాతీయ ఫార్ములా ఈ నిర్వాహక సంస్థ ఎఫ్ఐఏకి భారత దేశ విభాగం చెల్లించిన రూ.73 లక్షల రేసు ఫీజులను కూడా తిరిగి పంపించింది. భారతదేశ విభాగమైన ఎఫ్ఎంఎస్సీఐ తెలంగాణ ప్రభుత్వానికి ఈ డబ్బులు తీసుకోవాలని చాలాసార్లు కోరినా ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులను తీసుకోలేదు.
55 కోట్ల నిధులను రెండు వాయిదాల్లో తమకు ముట్టిన విషయాన్ని స్పష్టంగా పేరొంటూ తదుపరి మూడో వాయిదా గురించి స్పష్టంగా తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంతో పలుసార్లు లేఖల రూపంలో ఫార్ములా ఈ సంస్థ సంభాషణలు కొనసాగించింది. అత్యంత చట్టబద్ధంగా, పారదర్శకంగా హెచ్ఎండీఏ ఇండియన్ ఓవర్సీస్ అనే ప్రభుత్వ బ్యాంకు నుంచి ఈ నిధులను సంస్థకు చెల్లించింది. కానీ, ప్రభుత్వ రంగ బ్యాంకు ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొకి విదేశీ సంస్థకు నిధులు చెల్లించిందని రాష్ట్ర ప్రభుత్వం మతిలేని మాటలు మాట్లాడుతున్నది’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం దాచిపెట్టిందని చెప్పిన ఆయన, సర్కార్ కుట్రలను ఆధారాలతో సహా మీడియాకు వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ క్రీడల వల్ల జరిగే ప్రయోజనాలను అర్థం చేసుకునే తెలివిలేకనే కాంట్రాక్టును రద్దు చేసుకున్నదని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఈ రేస్ రద్దు వల్ల భారతదేశంలోపాటు హైదరాబాద్, తెలంగాణ పరువు అంతర్జాతీయ స్థాయిలో పోయింది. ఈ మేరకు ఫార్ములా ఈ భాగస్వాములైన పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, రాష్ట్ర ప్రభుత్వంపైన తీవ్రంగా విమర్శలు చేశారు. గతంలో ఫార్ములా ఈని మాంట్రియల్ అనే నగరంలో అకడ ప్రభుత్వం మారడం వల్ల కొత్త ప్రభుత్వం రద్దు చేసుకున్నది. ఫార్ములా ఈ సంస్థ మాంట్రియల్ నగరంపైన నష్టపరిహారం కేసు వేసి సుమారు మూడు మిలియన్ డాలర్లను నష్టపరిహారంగా పొందింది.
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హరీశ్‌సాల్వే అనే ప్రముఖ న్యాయవాదితో ఫార్ములా ఈ తెలంగాణ ప్రభుత్వంపైన వేసిన కేసును రాష్ట్ర ప్రభుత్వం దాచి పె ట్టింది. ప్రభుత్వం అబద్ధాలను మాత్రమే ప్ర చారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ది. ప్రభుత్వ డబ్బులు నేరుగా క్రీడా సంస్థ బ్యాంకులోకి ప్రభుత్వ రంగ బ్యాంకు ద్వారా చేరినప్పుడు అవినీతి అనే ప్రశ్నే ఉత్పన్నం కా దు. కానీ కొత్త ప్రభుత్వం ఫార్ములా ఈ సంస్థ తో జరిపిన సంభాషణలు, రేసు నిర్వహణ కో సం అంగీకరించిన నిర్ణయాలు, ఆ తర్వాత కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించి రేసు నుంచి తప్పుకోవడం, డబ్బులు చెల్లించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వంపై ఫార్ములా ఈ కేసు నమోదు చేయడం, కాంట్రాక్టు ప్రకారం డబ్బులు వెనకి తీసుకోవాలని కోరినా స్పందించకపోవడం వంటి అంశాలు దాచి పెట్టిం ది.
అసలు అవినీతి అనేదే జరగనప్పుడు, ప్రతి లావాదేవీ వివరాలు చాలా స్పష్టంగా ఉన్నప్పుడు, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాలాకోరు తనానికి నిదర్శనం’ అని కేటీఆర్ మండిపడ్డారు. మండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతిరాథోడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫార్ములా- ఈ రేస్ వ్యవహారంలో అణాపైసా కూడా వృథా కాలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. ప్రభుత్వం రూ.30 కోట్లు ఖర్చు చేస్తే రాష్ర్టానికి రూ.700 కోట్ల ప్రయోజనం కలిగినట్టు నీల్సన్ సంస్థ వెల్లడించినట్టు గుర్తుచేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే రేసులు రద్దయ్యాయి. దీంతో రాష్ర్టానికి రావాల్సిన ఈవీ రంగ పెట్టుబడులతోపాటు పేరు కూడా పోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది. భవిష్యత్తులో ఫార్ములా ఈ-రేసులు దేశానికి రాకుండా ప్రపంచ ఫార్ములా ఈ వ్యవస్థలో తీవ్ర నష్టం జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రానిక్ వెహికల్స్ రంగంలో హైదరాబాద్‌ను నిలిపేందుకు ఫార్ములా ఈ- రేస్ నిర్వహించాలని నిర్ణయించాం. అందులో విజయవంతంగా మొదటి రేస్ పూర్తి చేశాం. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సుమారు రూ.30 కోట్లు, ప్రైవేట్ స్పాన్సర్ ఏసీఈ అర్బన్ డెవలపర్స్ మరో రూ.110 కోట్లు ఖర్చు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిన కేవలం రూ.30 కోట్ల ఖర్చుతో రేస్ అనంతరం హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల ప్రయోజనం కలిగిందని నీల్సన్ సంస్థ తెలిపింది’ అని వివరించారు.
ఫార్ములా ఈ-కార్ రేసుతో తెలంగాణ కిర్తీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసు బనాయించడం అన్యాయం. ప్రజాసమస్యలపై నిలదీస్తుండడాన్ని ఓర్వలేకే ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు దిగుతున్నది. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి తప్పుడు పనులు మాని ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టాలి.
– మధుసూదనాచారి, శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత
కేటీఆర్‌పై కేసు నమోదు చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బద్నాం రాజకీయాలకు పాల్పడుతున్నది. రాజకీయ జిమ్మిక్కులతో మమ్మల్ని ఆపలేరు. మేం పోరాట యోధులం ప్రజల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తాం.
-హరీశ్‌రావు, మాజీమంత్రి
పాలన చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షం మీద కుట్రలు చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ సర్కారు నిరంకుశత్వానికి పరాకాష్ట. అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకే తప్పుడు కేసులతో గొంతునొక్కుతున్నది. కాంగ్రెస్ నియంతృత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం.
-నిరంజన్‌రెడ్డి, మాజీమంత్రి
ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకే రేవంత్ సర్కారు కేటీఆర్‌పై కక్ష సాధిస్తున్నది. ఈ-కార్ రేస్‌తో తెలంగాణ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తం చేసిన కేటీఆర్‌ను అణచివేసేందుకు కుట్రలకు దిగుతున్నది. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలకు బీఆర్ఎస్ బెదరదు. కచ్చితంగా తిప్పికొడతాం.
-వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీమంత్రి
కేటీఆర్‌ను ఓ కేసులో ఇరికించి రేవంత్‌రెడ్డి సంబుర పడుతున్నాడేమో కానీ న్యాయస్థానంలో మొట్టికాయలు తప్పవు. రేవంత్‌రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ చేయాలి. ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి. అక్రమ కేసు రేవంత్ దుర్మార్గ పాలనకు నిదర్శనం.
– ఎర్రబెల్లి దయాక్‌రావు, మాజీమంత్రి
అసెంబ్లీలో చర్చకు ముందుకురాని సీఎం రేవంత్‌రెడ్డి కేటీఆర్‌పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము కేసీఆర్ సైనికులం. చిల్లర వ్యవహారాలు మమ్మల్ని భయపెట్టవు. పోరాటం మాకు కొత్త కాదు. అక్రమ కేసులతో మా గొంతులను నొకలేరు.
-కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్నందుకే కేటీఆర్‌పై కక్ష సాధింపుతో కేసు పెట్టించారు. ప్రజల తరఫున ఉద్యమిస్తున్న ప్రతిపక్షనేతలను కాంగ్రెస్ పాలకులు కేసులతో వేధిస్తున్నారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చకు కేటీఆర్ సవాల్ విసిరినా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు పలాయనం చిత్తగించారు.
-తాతా మధుసూదన్, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
మూర్ఖుడు పాలకుడైతే పరిస్థితులు ఎట్లా ఉంటుందో రేవంత్‌రెడ్డిని చూస్తే అర్థమవుతున్నది. తెలంగాణ ఖ్యాతి ని విశ్వవ్యాప్తం చేసిన కేటీఆర్‌పై అక్రమ కేసులతో కుట్రలకు దిగుతున్నారు. బీఆర్ఎస్కు ఇవేం కొత్తకాదు. న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలో తిప్పికొడతాం.
-కర్నె ప్రభాకర్
రేవంత్‌రెడ్డి లెక కేటీఆర్ ఓటుకు నోటు దొంగ కాదు. హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తుంటే కేసుల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రేవంత్‌కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.
-బూడిద భిక్షమయ్యగౌడ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే
రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కేసు పేరుతో కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఆయన ఒక శక్తి. ఆయన్ను ముట్టుకుంటే తగిన గుణపాఠం నేర్పుతాం.
-బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే
రేవంత్‌రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్‌చేసి పాలనపై దృష్టి పెట్టాలి. కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం. హామీలు అమలు చేసేదాకా పోరాటం ఆపేదిలేదు.
-దేవీప్రసాద్, బీఆర్ఎస్ నాయకుడు
రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్‌పై దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి. జవాబు చెప్పేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నరు. కుట్రలు, కుతంత్రాలకు భయపడేదిలేదు.
-శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
కేటీఆర్‌పై ప్రభుత్వం పెట్టిన కేసు అక్రమం. ఇలాంటి కేసులు బీఆర్ఎస్ నేతల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీయలేవు. కేటీఆర్ అంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వణుకు పుడుతున్నది.
-జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
రేవంత్ దోపిడీకి అడ్డొస్తున్నారనే కేటీఆర్‌పై పగతో కేసు పెట్టించారు. కుట్ర లు, కుతంత్రాలతో ఆయన తాత్కాలికంగా ఆనందం పొందవచ్చు. భవిష్యత్‌లో మూల్యం చెల్లించకతప్పదు.
-దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ సీనియర్ నేత
కక్ష సాధింపు కోసమే కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి కేసు పెట్టించారు. రేవంత్ప్రజా సమస్యలు గాలికొదిలేసి కేటీఆర్‌ను అరెస్టు చేయడంపైనే దృష్టి పెట్టారు.
-రాకేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై దమనకాండకు దిగుతున్న ది. రేవంత్‌రెడ్డి తాటాకు చప్పుళ్లకు ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్ భయపడబోదు.
-పల్లె రవికుమార్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
సీఎం రేవంత్‌రెడ్డి మరింత దిగజారుడు రాజకీయం మొదలు పెట్టాడు. ఆరు గ్యా రంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల దృష్టిని మరల్చేందుకే కుట్రలకు దిగుతున్నది.
-విజయ్‌కుమార్, బీఆర్ఎస్ నేత
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతున్న కేటీఆర్‌ను అణగదొక్కేందుకే రేవంత్‌రెడ్డి తప్పుడు కేసు బనాయించారు. ఉడత బెదిరింపులకు బీఆర్ఎస్ బెదరదు.
-తుంగ బాలు, బీఆర్ఎస్ నాయకుడు
ఫార్మూలా ఈ- రేసుతో తెలంగాణ ప్రతిష్టను పెంచిన కేటీఆర్‌ను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. తప్పుడు కేసులు పెట్టి కుతంత్రాలకు దిగుతున్నది.
-అనిల్ కూర్మాచలం, బీఆర్ఎస్ నాయకుడు