e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home తెలంగాణ 4 వారాలు కీలకం

4 వారాలు కీలకం

  • ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు, ప్రజల జాగ్రత్తలు
  • కరోనా పాజిటివ్‌ల రేటులో స్థిరత్వం కనిపిస్తున్నది
  • ఇలాగే జాగ్రత్త వహిస్తే మే నెలాఖరుకు తగ్గుముఖం
  • రాష్ట్రంలో 50 వేలకు పైగా బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయి
  • 10 వేల ఆక్సిజన్‌ బెడ్స్‌ రెడీ.. మరో 10 వేలకు పనులు
  • ఆక్సిజన్‌ బెడ్స్‌లో 40శాతం వరకు ఖాళీగా ఉన్నాయి
  • సీఎం ముందుచూపుతో ఆక్సిజన్‌కు శాశ్వత పరిష్కారం
  • డీహెచ్‌ జీ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి వెల్లడి
  • రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించాలన్న ఆలోచన లేదు!
  • అందతా దుష్ప్రచారమేనన్న డీహెచ్‌ జీ శ్రీనివాసరావు

హైదరాబాద్‌, 28 (నమస్తే తెలంగాణ): ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు, కొవిడ్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలతోనే రాష్ట్రంలో కేసుల పెరుగుదల రేటులో స్థిరత్వం కనిపిస్తున్నదని, రానున్న రోజుల్లో ఇదే కృషి కొనసాగితే మే నెల చివరి నాటికి కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నామని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు చెప్పారు. వారం రోజులుగా తెలంగాణలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని అన్నారు. వచ్చే మూడు, నాలుగు వారాలు అత్యంత కీలకమని ఆయన స్పష్టంచేశారు. పెండిండ్లు, పండుగల సీజన్‌ కావడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తిచేశారు. బుధవారం కోఠి డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కార్యాలయంలో డీఎంఈ రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

‘ఒక వ్యక్తి మాస్క్‌ వేసుకుంటే 50%, ఎదుటి వ్యక్తి కూడా మాస్క్‌ వేసుకుంటే 80%, అందరం మాస్క్‌ ధరిస్తే 100% కరోనా నుంచి బయటపడటం సాధ్యమవుతుంది’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిస్థితులు కొంత కుదుటపడుతున్నాయని.. మహారాష్ట్ర, ఢిల్లీలోనూ కేసుల సంఖ్యలో తీవ్ర పెరుగుదల కనిపించడం లేదని తెలిపారు. ప్రజల్లో వైరస్‌పై అవగాహన పెరిగిందని, 90% మంది మాస్క్‌లు ధరించడం శుభపరిణామమని చెప్పారు. భౌతికదూరం, పరిశుభ్రతలోనూ శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. దీన్ని ఇలాగే కొనసాగిస్తే త్వరలో కరోనా బారినుంచి బయటపడొచ్చని ఆశాభావం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌ సూచన మేరకు 18 ఏండ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నామని, 45 ఏండ్ల వయస్సు దాటిన వారికి మే1 నుంచి సెకండ్‌డోస్‌ వేయనున్నామని తెలిపారు. ప్రైవేటు దవాఖానలు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లపై ఫీజులు, సేవల్లో లోపం తదితర అంశాలపై ఫిర్యాదులకు ప్రత్యేక వాట్సప్‌ నంబర్‌ 9154170960ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

45 లక్షల మందికి వ్యాక్సినేషన్‌
రాష్ట్రంలో ఇప్పటివరకు 45 లక్షల మందికిపైగా వ్యాక్సిన్‌ వేసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. 50 వేలకు పైగా బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయని, 50 నుంచి 60 శాతం వరకు మాత్రమే ఆక్సిజన్‌ బెడ్స్‌ నిండాయని చెప్పారు. బెడ్స్‌ సంఖ్యను మరింత పెంచేందుకు ప్రైవేటు దవాఖానాలు, మెడికల్‌ కాలేజీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. అన్ని విషయాల్లోనూ ఇతర రాష్ట్రాల కంటే చాలా మెరుగ్గా ఉన్నామని వివరించారు. సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌ ఉన్నప్పటికీ గంటగంటకు వైద్యారోగ్యశాఖ మంత్రి, సీఎస్‌లకు అవసరమైన సూచనలు చేస్తున్నారని శ్రీనివాసరావు చెప్పారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అనునిత్యం పర్యవేక్షిస్తున్నారన్నారు.

ఆక్సిజన్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం: డీఎంఈ రమేష్‌రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్రంలో ఆక్సిజన్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని డీఎంఈ రమేశ్‌రెడ్డి తెలిపారు. మొదటి వేవ్‌లో తీసుకున్న చర్యలు ప్రస్తుతం ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నదని చెప్పారు. 23 దవాఖానల్లో ఆక్సిజన్‌ స్టోరేజీ ట్యాంకులు పెట్టామని.. అవి ఒక్కసారి ఫిల్‌ అయితే 48 గంటల దాకా ఎలాంటి అంతరాయం లేకుండా వాడుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పదివేల ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయని, మరో పదివేలు పడకలకు ఆక్సిజన్‌ లైన్లు వేసేందుకు రూ.20 కోట్లతో పనులు ప్రారంభించినట్టు తెలిపారు.

సందేహాలు.. సమాధానాలు
కరోనా నేపథ్యంలో పరీక్షలు, చికిత్స, హాస్పిటల్‌లో చేరటం తదితర అంశాలపై ప్రజల్లో సాధారణంగా నెలకొంటున్న పలు సందేహాలను శ్రీనివాసరావు, రమేశ్‌రెడ్డి నివృత్తి చేశారు.

ఎవరికి కరోనా పరీక్షలు కావాలి?
జ్వరం, దగ్గు, జలుబు, కండ్లలో మంటలు, ఎర్రబడటం, ఒంటి నొప్పులు, తలనొప్పి, విరేచనాలు, వాసన, రుచి తగ్గడం వంటి లక్షణాలు ఉంటేనే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు అవసరం. సాధారణ ఫ్లూ లక్షణాలు ఒకట్రెండు రోజులు ఉంటాయి. అయినా తగ్గకుంటే కొవిడ్‌గా అనుమానించి పరీక్షలు చేయించుకోవాలి.

లక్షణాలు లేనివారు పరీక్ష కేంద్రానికి వెళ్తే ఏమవుతుంది?
ఎలాంటి లక్షణాలు లేనివారు కొందరు పరీక్ష కేంద్రానికి వెళ్తున్నారు. కొందరు అనుమానంతో వారానికి రెండు, మూడుసార్లు పరీక్షలు చేసుకుంటున్నారు. వీటి వల్ల నిజంగా పరీక్షలు అవసరమైనవారు నష్టపోతున్నారు. దీనికితోడు పరీక్ష కోసం కేంద్రానికి వెళ్లి అక్కడే వైరస్‌బారిన పడుతున్నారు.

పడకలు అవసరమైతే ఏం చేయాలి?
లక్షణాలు తీవ్రంగా ఉంటే 108కి ఫోన్‌చేయాలి. 450 అంబులెన్స్‌లు, కరోనాకోసం ప్రత్యేకంగా 150 అంబులెన్సులు సేవలందిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో పడకల వివరాలు అంబులెన్స్‌ పైలట్‌ వద్ద ఉంటాయి. బాధితులు సూచించిన దవాఖానలో పడకలు లేకుంటే వెంటనే పైలట్‌ సూచన మేరకు సమీప దవాఖానలో చేరొచ్చు.

దవాఖానల్లో ఎవరు చేరాలి?
85-90% మందికి దవాఖానలో అడ్మిషన్‌ అవసరం లేదు. కరోనా బారినపడ్డ వారిలో రాష్ట్రంలో 99% మంది కోలుకుంటున్నారని గుర్తుంచుకోవాలి. ఇంట్లో లేదా కొవిడ్‌ కేర్‌సెంటర్‌లో హోం ఐసోలేషన్‌ కిట్ల మందులు వాడితే చాలు. పాజిటివ్‌ రాగానే భయంతో పడకల కోసం పరుగులు తీయాల్సిన అవసరం లేదు. లక్షణాల తీవ్రత, ఇతర దీర్ఘకాలిక రోగాలను బట్టి అడ్మిషన్‌ అవసరం ఉంటుంది. సాచురేషన్‌ లెవల్స్‌ 93 కంటే పడిపోవడం, ఆయాసం పెరగటం, ఊపిరి తీసుకోవడంలో కొంచెం సమస్యలున్నా దవాఖానకు వెళ్లాలి.

రెమ్‌డెసివిర్‌ బ్రహాస్త్రమా?
రెమ్‌డెసివిర్‌ తీసుకుంటే కొవిడ్‌ పోతుందనేది అపోహ. ఇప్పటికీ అది ఇన్వెస్టిగేటివ్‌ డ్రగ్‌ మాత్రమే. కాకుంటే వైరల్‌ లోడ్‌ను కొంత తగ్గిస్తుంది. ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం, ఎవరికైతే సాచురేషన్‌ లెవల్‌ 92 కిందికి పడిపోతుందో.. తీవ్ర శ్వాస ఇబ్బందులు తలెత్తుతాయో వారికే వాడాలి. ప్రజల్లో అపోహ, కొన్ని ప్రైవేటు దవాఖానల అతి ప్రచారం వల్ల రెమ్‌డెసివిర్‌ కృత్రిమ కొరత, దుర్వినియోగం మొదలైంది. అవసరమైన ప్రతి ఔషధం ప్రభుత్వ దవాఖానల్లో నిండుగా ఉన్నది.

టీకా వేసుకున్నా కొవిడ్‌ వస్తే ఏంచేయాలి’?
టీకా వేసుకున్నప్పటికీ జాగ్రత్తలు పాటించకపోతే కరోనా వచ్చే అవకాశం 20% వరకు ఉంటుంది. దీనిని ఆయా కంపెనీలే స్పష్టం చేస్తున్నాయి. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి వైరస్‌ సోకితే స్వల్ప లక్షణాలతోనే బయటపడుతున్నారు. రెండు డోసులు తీసుకున్న 80, 90 ఏండ్లవారిలో ఎవరూ తీవ్ర లక్షణాలతో దవాఖానలో చేరలేదు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో 80% మంది వైరస్‌ బారినపడలేదు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement