Congress |హైదరాబాద్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు. వామపక్షాలతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన కాంగ్రెస్ చివరకు మొండి చెయ్యి చూపించేందుకు సిద్ధమైంది. సీపీఐ, సీపీఎంకు ఇస్తామన్న రెండు స్థానాలపై కూడా వెనకడుగు వేస్తున్నట్టు తెలిసింది. వామపక్షాలతో ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఆ పార్టీలు కోరుతున్న స్థానాల్లో కూడా తమ అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం.
సీపీఐ కోరుకుంటున్న కొత్తగూడెం, చెన్నూరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, గడ్డం వంశీని ఖరారు చేశారనే ప్రచారం జరుగుతున్నది. సీపీఎం కోరుతున్న మిర్యాలగూడ, వైరా స్థానాల్లో బత్తుల లక్ష్మారెడ్డి, విజయాబాయిని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నెల 3 నుంచి నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ వ్యవహారశైలి, పొత్తుల అంశంపై తేల్చుకునేందుకు బుధవారం హైదరాబాద్లో వామపక్షాల రాష్ట్ర కమిటీ నేతలు సమావేశం కానున్నారు. సమావేశంలో పొత్తులపై చర్చించి, తుది నిర్ణయం ప్రకటిస్తామని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యర్శులు కూనంనేని సాంబశివరావు తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.